Share News

కెనడా, గ్రీన్‌లాండ్‌, వెనెజువెలా.. అన్నీ మావే!

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:29 AM

కెనడా, వెనెజువెలా, గ్రీన్‌లాండ్‌లను అమెరికా భూభాగాలుగా చూపించే మ్యాప్‌ ఉన్న ఫొటోనొకదాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్‌సోషల్‌లో పోస్ట్‌ చేశారు...

కెనడా, గ్రీన్‌లాండ్‌, వెనెజువెలా.. అన్నీ మావే!

  • ఆ మూడింటినీ అమెరికాలో భాగంగా చూపే ఏఐ చిత్రాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌

  • గ్రీన్‌లాండ్‌లో అమెరికా జెండా ఎగరేస్తున్నట్టు మరో ఫొటో

  • ఫ్రెంచ్‌ వైన్లు, షాంపేన్లపై 200 శాతం సుంకాలు వేస్తా

  • అప్పుడు మేక్రాన్‌ దారికొచ్చి శాంతి వేదికలో చేరతారు

  • ఫ్రాన్స్‌ అధ్యక్షుడిపై ట్రంప్‌ వ్యాఖ్య

వాషింగ్టన్‌, జనవరి 20: కెనడా, వెనెజువెలా, గ్రీన్‌లాండ్‌లను అమెరికా భూభాగాలుగా చూపించే మ్యాప్‌ ఉన్న ఫొటోనొకదాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్‌సోషల్‌లో పోస్ట్‌ చేశారు! కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన ఆ ఫొటోలో.. ట్రంప్‌ వైట్‌హౌ్‌సలోని తన కార్యాలయంలో (ఓవల్‌ ఆఫీస్‌) కూర్చుని ఉండగా, ఆయన ముందు తన గ్రీన్‌లాండ్‌ ఆశలకు అడ్డంకిగా ఉన్న నాటో సభ్యదేశాల నేతలైన మేక్రాన్‌ (ఫ్రాన్స్‌ అధ్యక్షుడు), జార్జియా మెలొనీ (ఇటలీ పీఎం), కీర్‌ స్టార్మర్‌ (బ్రిటన్‌ ప్రధాని), యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌డెర్‌ లెయెన్‌ తదితరులున్నారు! అలాగే మరో పోస్టులో ట్రంప్‌ ఇంకో ఫొటో పెట్టారు. ట్రంప్‌ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, యూఎస్‌ విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో కలిసి గ్రీన్‌లాండ్‌లో అమెరికా జెండా ఎగరేస్తున్నట్టుగా ఉన్న ఫొటో అది. పక్కనే ఒక బోర్డు మీద.. ‘గ్రీన్‌లాండ్‌, అమెరికా భూభాగం’ అని ఉంది. కాగా.. తాను ప్రతిపాదించిన ‘శాంతి వేదిక(బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌)’లో చేరడానికి నిరాకరిస్తున్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మేలో మేక్రాన్‌ పదవీకాలం ముగుస్తుందన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘త్వరలో పదవి నుంచి దిగిపోయే మేక్రాన్‌ శాంతి వేదికలో చేరాలని ఎవరూ అనుకోవట్లేదు’’ అని ఎద్దేవాగా అన్నారు. ఫ్రాన్స్‌ గనక బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌లో చేరకపోతే ఫ్రెంచ్‌ వైన్లు, షాంపేన్లపై 200 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. అప్పుడు మేక్రాన్‌ తప్పనిసరిగా అందులో చేరుతారని పేర్కొన్నారు. అంతేకాదు... గ్రీన్‌లాండ్‌ అంశంపై మేక్రాన్‌ తనకు పంపిన వ్యక్తిగత సందేశాలను కూడా ట్రంప్‌ బహిర్గతం చేశారు. ‘‘సిరియా విషయంలో మన ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ఇరాన్‌ విషయంలో మనం కలిసి గొప్ప పనులు చేయగలం.


కానీ, గ్రీన్‌లాండ్‌ విషయంలోనే మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దీనిపై నేను దావోస్‌ భేటీ అనంతరం ప్యారి్‌సలో గురువారం మధ్యాహ్నం జీ7 దేశాల సమావేశాన్ని నిర్వహిస్తా. ఉక్రెయిన్‌, డెన్మార్క్‌, సిరియా, రష్యావారిని ఆహ్వానిస్తాను. ఆ రోజు మీరు అమెరికాకు తిరిగి వెళ్లే ముందు ప్యారి్‌సలో మనిద్దరం రాత్రి భోజనం చేద్దాం’’ అని మేక్రాన్‌ పంపిన ఆ సందేశాల్లో ఉంది. అంటే.. ట్రంప్‌ ప్రతిపాదించిన శాంతి వేదికకు బదులుగా, పలు అంశాల్లో తాను మధ్యవర్తిగా వ్యవహరించాలని మేక్రాన్‌ భావించారు! అది ట్రంప్‌కు నచ్చకపోవడంతో ఇలా 200ు టారి్‌ఫలంటూ తనకు అలవాటైన రీతిలో సుంకాల రంకెలు వేశారు. అయితే.. ఇలాంటి బెదిరింపులేవీ పనిచేయవని, సుంకాల బెదిరింపులతో తమ విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేస్తామంటే కుదరదని మేక్రాన్‌ వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. మేక్రాన్‌ తనకు పంపిన సందేశాలను బహిర్గతం చేసిన అనంతరం, నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టే (ఈయన నెదర్లాండ్స్‌ మాజీ ప్రధాని కూడా) పంపిన ప్రైవేటు సందేశాలను సైతం ట్రంప్‌ తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు. దావో్‌సలో తాను మీడియాతో ఏం మాట్లాడబోయేదీ.. ట్రంప్‌కు పంపిన ఆ సందేశాల్లో రుట్టే ముందే పేర్కొనడం గమనార్హం.

Updated Date - Jan 21 , 2026 | 07:19 AM