Donald Trump Says NATO: అమెరికా లేకుంటే.. నాటోకు ఎవరూ భయపడరు
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:19 AM
అమెరికాకు నిజంగా అవసరమైనప్పుడు నాటో దేశాలు తోడుగా నిలిచేది అనుమానమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
రష్యా, చైనా భయపడేది ఒక్క అమెరికాకే..
అమెరికాకు అవసరమైనప్పుడు నాటో అండగా నిలిచేది డౌటే!
నేను జోక్యం చేసుకోకుంటే ఉక్రెయిన్ ఇప్పటికే రష్యా వశమై ఉండేది
ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపా.. అయినా నార్వే నాకు నోబెల్ నిరాకరించి మూర్ఖంగా వ్యవహరించింది: ట్రంప్
గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటే నాటో ముక్కలేనన్న యూరప్ దేశాలకు అమెరికా అధ్యక్షుడి కౌంటర్
వాషింగ్టన్, జనవరి 7: అమెరికాకు నిజంగా అవసరమైనప్పుడు నాటో దేశాలు తోడుగా నిలిచేది అనుమానమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా లేకుంటే నాటోకు ఎవరూ భయపడబోరని.. రష్యా, చైనా గౌరవించే, భయపడే ఏకైక దేశం అమెరికానే అని పేర్కొన్నారు. అమెరికా మిలటరీ సామర్థ్యాన్ని తాను పునర్నిర్మిస్తున్నానని తెలిపారు. అమెరికా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటే నాటో ముక్కలైపోయినట్టేనంటూ.. కూటమి భాగస్వామ్య దేశాలైన డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోలాండ్ తదితర దేశాలు హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బుధవారం తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ దీనిపై పోస్టు పెట్టారు. ‘‘నాటో అభిమానులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏదేమైనా నాటో దేశాల వారంతా మా స్నేహితులు. నేను జోక్యం చేసుకోకపోయి ఉంటే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ మొత్తాన్నీ స్వాధీనం చేసుకునేది. నేను ఒంటి చేత్తో 8 యుద్ధాలు ఆపాను. కానీ నాటో దేశం నార్వే నాకు నోబెల్ బహుమతి ఇవ్వకుండా మూర్ఖంగా వ్యవహరించింది. నేను అమెరికా మిలటరీని పునర్నిర్మించి బలోపేతం చేస్తుండటం మన అదృష్టం. అమెరికా లేకుంటే నాటోకు రష్యా, చైనా.. ఎవరూ భయపడరు. అయినా అమెరికాకు అవసరమైనప్పుడు నాటో తోడుగా ఉంటుందా అన్నది నాకు అనుమానమే. వారు తోడుగా లేకున్నా అమెరికా మాత్రం నాటోకు తోడుగా ఉంటుంది. చైనా, రష్యా భయపడేది, గౌరవించేది ఒక్క అమెరికాను మాత్రమే’’ అని ట్రంప్ పేర్కొన్నారు.