Share News

ఆ రహస్య ఆయుధం డిస్కంబాబులేటర్‌

ABN , Publish Date - Jan 26 , 2026 | 04:17 AM

వెనెజువెలాలో సైనిక చర్య సమయంలో అమెరికా సైనికులు వాడిన రహస్య ఆయుధం పేరును ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఎట్టకేలకు బయటపెట్టారు.

ఆ రహస్య ఆయుధం డిస్కంబాబులేటర్‌

  • ఈ నెల 3న వెనెజువెలా ఆపరేషన్‌లో వాడింది అదేనన్న ట్రంప్‌

వాషింగ్టన్‌, జనవరి 25: వెనెజువెలాలో సైనిక చర్య సమయంలో అమెరికా సైనికులు వాడిన రహస్య ఆయుధం పేరును ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఎట్టకేలకు బయటపెట్టారు. న్యూయార్క్‌ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. ఆ ఆయుధం పేరును ‘డిస్కంబాబులేటర్‌’ అని తెలిపారు. ‘అది డిస్కంబాబులేటర్‌. అంతకుమించి దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టంలేదు. వెనెజువెలా గగనతల రక్షణ వ్యవస్థను, రాడార్లను అది నిర్వీర్యం చేసింది. వాళ్లు ఒక్క రాకెట్‌ను కూడా ప్రయోగించలేకపోయారు. రష్యా, చైనాల నుంచి తెచ్చుకున్న ఒక్క క్షిపణిని కూడా ప్రయోగించలేకపోయారు. వాళ్లు వారి ఆయుధాల మీటలు నొక్కినా ఒక్కటి కూడా పనిచేయలేదు’ అని ట్రంప్‌ వివరించారు. ఈ నెల 3న అర్ధరాత్రి కేవలం 20 మంది అమెరికా సైనికులు డ్రోన్లు, హెలికాప్టర్లతో వెళ్లి వెనెజువెలా అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణి సిలియాలను అపహరించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో అమెరికా సైనికులు ఏదో కొత్త తరహా ఆయుధం ప్రయోగించారని మదురో మాజీ బాడీగార్డు ఒకరు ఇటీవల చెప్పగా దానిపై తీవ్ర చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, వెనెజువెలా చమురును తాము ఇప్పటికే తీసేసుకున్నామని ట్రంప్‌ తెలిపారు. వెనెజువెలా నుంచి వివిధ దేశాలకు వెళ్తున్న 7ఆయిల్‌ ట్యాంకర్లను అమెరికా ఇటీవల స్వాధీనం చేసుకుంది. దీనిపై ట్రంప్‌ మాట్లాడుతూ..‘వారివద్ద(వెనెజువెలా) ఎలాంటి చమురు లేదు. దాన్ని మేము తీసేసుకున్నాం. ఇప్పటికే దాన్ని శుద్ధి కూడా చేశాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Jan 26 , 2026 | 04:17 AM