Nobel Peace Prize: ట్రంప్ చేతికి నోబెల్ శాంతి పతకం
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:44 AM
వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మచాడో.. తన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు బహుకరించారు.
తనకు వచ్చిన బహుమతిని అమెరికా అధ్యక్షుడికి బహూకరించిన మచాడో
వాషింగ్టన్, జనవరి 16: వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మచాడో.. తన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు బహుకరించారు. గురువారం వైట్‌హౌ్‌సలో ట్రంప్‌తో భేటీ సందర్భంగా ఆయనకు నోబెల్‌ను ఇచ్చినట్లు మచాడో తెలిపారు. ‘వెనెజువెలాకు స్వేచ్ఛను కల్పించటానికి సైద్ధాంతిక మద్దతుతోపాటు అత్యంత కీలకమైన తోడ్పాటునందించిన ట్రంప్ కృషికిగుర్తింపుగా నా దేశ ప్రజల తరఫున ఇది నేను వ్యక్తిగతంగా అందిస్తున్నా. అమెరికా, ట్రంప్ చూపిన అసాధారణ ధైర్యాన్ని వెనెజువెలా ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు’ అని మచాడో ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిపై ట్రంప్ ట్రూత్ సోషల్’లో స్పందిస్తూ.. ‘‘నేను చేసిన కృషికిగాను మచాడో తనకు వచ్చిన నోబల్ బహుమతిని బహుకరించారు. ఇది పరస్పర గౌరవానికి ఓ అద్భుత ఉదాహరణ. థాంక్‌యూ మరియా’’ అని పేర్కొన్నారు. మరోవైపు, నోబెల్ శాంతి బహుమతిని అందించే నోబెల్ పీస్ సెంటర్ ఈ వ్యవహారంపై తన వైఖరిని స్పష్టం చేసింది. ‘ఒకసారి నోబెల్ బహుమతిని ప్రకటించిన తర్వాత దానిని రద్దు చేయటంగానీ, ఇతరులతో పంచుకోవటంగానీ, ఇతరులకు బదిలీ చేయటంగానీ కుదరదు’ అని పేర్కొంది. ‘పతకం తన యజమానులను మార్చుకోగలదేమోగానీ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేరు (నోబెల్ లారెట్) పేరు మాత్రం మారదు’ అని స్పష్టం చేసింది.