Trump Action Against Iran: ఇరాన్‌పై దాడికి ట్రంప్ రెడీ?
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:05 AM
ఇరాన్‌లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళన మరింత తీవ్రరూపం దాల్చింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్ర దమనకాండకు దిగటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది.
ఇరాన్ ప్రజలకు సాయం చేస్తామని ట్వీట్
దాడి చేసే అవకాశాలపై అధికారులతో చర్చ
దాడిచేస్తే ఇజ్రాయెల్, అమెరికాలే మా లక్ష్యం
ప్రజాందోళనల నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక భేటీలో ఇరాన్ స్పీకర్ ఖలీబాఫ్ హెచ్చరిక
వాషింగ్టన్/టెహ్రాన్, జనవరి 11: ఇరాన్‌లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళన మరింత తీవ్రరూపం దాల్చింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్ర దమనకాండకు దిగటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. గత నెల 28న ప్రారంభమైన ఆందోళనల్లో ఇప్పటివరకు దాదాపు 538మంది మరణించినట్లు సమాచారం. పోలీసులు 10,800 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. మృతుల్లో 48 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రజలకు మద్దతుగా అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అణచివేత నేపథ్యంలో ఇరాన్ ప్రజలకు సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ‘స్వాతంత్య్రం కోసం ఇరాన్ ఎదురుచూస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ఇరాన్ ప్రజలు పోరాడుతున్నారు. వారికి సాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరాన్‌పై వైమానిక దాడులు చేసే అవకాశాలపై ఉన్నతాధికారులు ట్రంప్‌తో శనివారం చర్చించారు. దీంతో ఇరాన్ పాలకులే లక్ష్యంగా త్వరలో అమెరికా దాడిచేసే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో శనివారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడి ఇరాన్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు. ఇజ్రాయెల్ కూడా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఒకవేళ అమెరికా దాడులు మొదలుపెడితే ఇరాన్ తమపై ప్రతీకార దాడులు చేయవచ్చన్న అంచనాతో దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.
ఇజ్రాయెల్, అమెరికాలే మా టార్గెట్: ఇరాన్
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమపై ఏ రకమైన దాడి జరిగినా ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని ఆదివారం హెచ్చరించింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు దేశం మొత్తం విస్తరించిన నేపథ్యంలో ఇరాన్ పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా పార్లమెంటు స్పీకర్ ఖలిబాఫ్.. అమెరికాకు హెచ్చరికలు జారీచేశారు. నిరసనకారులు ఇరాన్ సమాజాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు నిరసనకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తెలిపారు. మరోవైపు,ఇరాన్ ప్రజల్లో క్రమంగా పాత రాజరికానికి మద్దతు పెరుగుతోంది. 1979లో అంతమైన పహ్లవి రాజరికం సమయంలో అమలులో ఉన్న సింహం, సూర్యుడి చిత్రాలున్న పతాకాలు దేశమంతా దర్శనమిస్తున్నాయి.
ట్రంప్‌కు నోబెల్ ఇవ్వొద్దు
తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌నకు ఇచ్చేస్తానని వెనిజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో చేసిన ప్రతిపాదనలపై నోబెల్ సంస్థ స్పష్టతనిచ్చింది. నోబెల్ శాంతి బహుమతిని ఒకసారి ప్రకటించిన తర్వాత దానిని రద్దు చేయడం, బదిలీ చేయడం, ఇతరులతో పంచుకోవడం సాధ్యం కాదని ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. నోబెల్ శాంతి బహుమతి నిర్ణయం శాశ్వతమని పేర్కొంది.