ఈ ఎన్నికలు నిజాయతీగానే జరిగాయా?
ABN , Publish Date - Nov 10 , 2026 | 02:13 AM
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదుర్కొన్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తొలిసారిగా ఆ ఎన్నికల విశ్వసనీయతపైనే పలు సందేహాలు వ్యక్తం చేశారు.
ముందస్తు ఓటింగ్‌లో ఒకేసారి భారీగా ఓట్లు
ఓటర్ల కంటే ఓటింగ్ యంత్రాలే ఫలితాలను శాసించాయి.. ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్
వలసదారులపై అంత కఠినంగా ఉండాల్సింది కాదంటూ పశ్చాత్తాపం
డెమోక్రాట్లతో కలిసి పనిచేస్తానని ప్రకటన
వాషింగ్టన్, నవంబరు 9: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదుర్కొన్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తొలిసారిగా ఆ ఎన్నికల విశ్వసనీయతపైనే పలు సందేహాలు వ్యక్తం చేశారు. సోమవారం తన ట్రూత్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ఆయన ‘ఈ ఎన్నికలు నిజయాతీగా జరిగాయని ఎవరైనా నమ్ముతున్నారా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల సర్వేలు (ఒపీనియన్ పోల్స్) ఇంత ఘోరంగా ఎలా తప్పుతాయని నిలదీశారు. ముందస్తు ఓటింగ్‌లో ఒకేసారి పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని.. దీంతో ఓటింగ్ శాతం ఎంతున్నా, విజయం సాధించడం అసాధ్యంగా మారిందన్నారు. ఓటర్ల కంటే ఓటింగ్ యంత్రాలే ఫలితాలపై ఎక్కువ ప్రభావం చూపించాయన్నారు. మొదటి విడత అధ్యక్ష పదవీకాలం అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు కూడా, ట్రంప్ ఇదే మాదిరి సందేహాలు లేవనెత్తడం గమనార్హం.
అలా వ్యవహరించాల్సింది కాదేమో..
తమ వలస విధానాలు (ఇమిగ్రేషన్) మరీ కఠినంగా ఉన్నాయని, అలా ఉండాల్సింది కాదని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. రానున్న రోజుల్లో డెమోక్రాటిక్ పార్టీతో కలసి పనిచేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఆదివారం రాత్రి ప్రసారమైన సీబీఎస్ మీడియా 60 మినిట్స్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల ఓటమికి గల కారణాలను వివరించారు. ఓటర్ బ్యాలెట్‌పై తన పేరు లేకపోవడంతో.. తన ప్రచార సభల్లో కనిపించిన ఉత్సాహాన్ని, తనపై ప్రజలకు ఉన్న అభిమానాన్ని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు బదిలీ చేయలేకపోయాయని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను కూడా ఆయన తప్పుబట్టారు. తన నాయకత్వంలో అభ్యర్థులు ప్రచారం చేయలేదన్నారు. ఇరాన్‌తో యుద్ధం, గ్యాస్ ధరలు పెరగడం, ఇజ్రాయెల్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా రిపబ్లికన్ల పేలవ ప్రదర్శనకు కారణాలుగా పేర్కొన్నారు. ‘‘సరిహద్దులను మూసివేసినందుకు మాకు ‘ఏ ప్లస్’ మార్కులు వచ్చాయి. అలాగే నేరగాళ్లని దేశం నుంచి పంపించి వేసినందుకు కూడా ఎక్కువ మార్కులే పడ్డాయి. ఏవో చిన్న ఉల్లంఘనలతో, దేశంలోకి వచ్చి మంచి ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా ఇబ్బంది పెట్టడం మాకు నష్టం చేసింది. అలాంటి వారిని దేశం నుంచి పంపేయాలని కొంతమంది భావిస్తుంటే.. మంచి కంపెనీల్లో పనిచేస్తూ, పన్నులు కడుతున్న వారిని ఉండనివ్వాలి కదా! అని మరి కొంత మంది అనుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. భారత్, పాక్ మధ్య అణు యుద్ధాన్ని అడ్డుకున్నానని పునరుద్ఘాటించారు. మరణానంతరం స్వర్గానికి వెళ్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇరాన్ వైఖరిని బట్టి యుద్ధంపై నిర్ణయం
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అణు కార్యక్రమంపై చర్చల్లో పురోగతి ఉంటే ఇరాన్‌పై తిరిగి యుద్ధం చేయాల్సిన అవసరం ఉండబోదని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. బలమైన ఒప్పందంపై వారు సంతకం చేస్తారా? లేదా? అనే దానిపై తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని సీఎన్‌ఎన్ న్యూస్‌తో మాట్లాడుతూ తెలిపారు.