Share News

డీయెగో గార్సియాపై ట్రంప్‌ కన్ను

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:35 AM

అమెరికా జాతీయ భద్రత పేరుతో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌.. భారత్‌కు అత్యంత సమీపంలో ఉన్న డీయెగో గార్సియాపైనా కన్నేశారు. హిందూ మహా సముద్రంలో కీలక ప్రాం తంలో ఉన్న ఈ చిన్న దీవిని తమ నియంత్రణలో ఉంచుకోవడం మేలన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు.

డీయెగో గార్సియాపై ట్రంప్‌ కన్ను

  • కీలక దీవిని మారిషస్‌కు తిరిగిచ్చే యూకే నిర్ణయం మూర్ఖత్వమంటూ పోస్టు

న్యూఢిల్లీ, జనవరి 20: అమెరికా జాతీయ భద్రత పేరుతో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌.. భారత్‌కు అత్యంత సమీపంలో ఉన్న డీయెగో గార్సియాపైనా కన్నేశారు. హిందూ మహా సముద్రంలో కీలక ప్రాం తంలో ఉన్న ఈ చిన్న దీవిని తమ నియంత్రణలో ఉంచుకోవడం మేలన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు. మారిష్‌సకు చెందిన ఈ దీవి ప్రస్తుతం యూకే ఆధీనంలో ఉంది. ఇక్కడ యూకే, అమెరికాల ఉమ్మడి సైనిక, నౌకా స్థావరం ఉంది. అయితే ఈ దీవిని మారిష్‌సకు తిరిగి ఇచ్చేందుకు గత ఏడాదే బ్రిటన్‌, మారిషస్‌ మధ్య ఒప్పందం కుదిరింది. దానిని తప్పుపడుతూ, తాను గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి లింకు పెడుతూ ట్రంప్‌ తాజాగా పోస్టు పెట్టారు. ‘‘మా తెలివైన నాటో మిత్రదేశం యూకే కీలక అమెరికా సైనిక స్థావరం ఉన్న డీయెగో గార్సియాను మారిష్‌సకు తిరిగి ఇచ్చేస్తోంది. ఎలాంటి కారణం లేకుండా ఇలా చేయడం ఆశ్చర్యకరం. ఇది మన అసమర్థతకు నిదర్శనమని చైనా, రష్యా గుర్తిస్తాయనడంలో సందేహమే లేదు. సమర్థతకు మా త్రమే విలువ ఇచ్చే అంతర్జాతీయ శక్తులు అవి. ఇ ప్పుడు అమెరికా నా ఏడాది నాయకత్వంలోనే ఎప్పు డూ లేనంతగా గౌరవం పొందుతోంది. అత్యంత కీలకమైన దీవిని తిరిగివ్వాలని యూకే నిర్ణయించడం పూర్తిగా మూర్ఖత్వం’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

మారిష్‌సకు తిరిగి ఇచ్చేందుకు ఒప్పందం..

ఒకప్పుడు మారిష్‌సలో భాగమైన చాగో దీవుల సముదాయంలోని పెద్ద దీవి డీయెగో గార్సియా. మారిషస్‌ ప్రధాన భూభాగానికి 2,112 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దీవి విస్తీర్ణం కేవలం 30 చదరపు కిలోమీటర్లే. హిందూ మహా సముద్రంలో భారత్‌కు దిగువన, మాల్దీవులకు సమీపంలో ఉంటుంది. భారత్‌, చైనాతోపాటు అటు గల్ఫ్‌, ఆఫ్రికా దేశాలు.. ఇటు ఆగ్నేయాసియా ప్రాంతాలకు మధ్యలో ఉండటంతో అటు సముద్ర రవాణాపై నిఘాకు, ఇటు సైనికపరంగా అత్యంత కీలక ప్రాంతమిది. మారిషస్‌ తమ వలస పాలనలో ఉన్నప్పటి నుంచీ డీయెగో గార్సియాపై బ్రిటన్‌కు పట్టుంది. మారిష్‌సకు 1968లో స్వాతంత్య్రం ఇచ్చిన బ్రిటన్‌.. అప్పటి మారిషస్‌ పాలకులపై ఒత్తిడి తెచ్చి డీయెగో గార్సియా దీవిని కొనుగోలు చేసింది. అక్కడి ప్రజలను బయటికి తరలించి, అమెరికాతో కలిసి సైనిక స్థావరం ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది.


మారిష్‌సకు భారత్‌ మద్దతు

డీయెగో గార్సియాను తమకు తిరిగి ఇచ్చేయాలని కొన్నేళ్లుగా యూకేపై మారిషస్‌ ఒత్తిడి పెంచింది. అంతర్జాతీయ కోర్టులో కేసులు కూడా వేసింది. మా రిష్‌సకు అనుకూలంగా అంతర్జాతీయ కోర్టు తీర్పు ఇ చ్చింది. అయినా యూకే వినలేదు. అయితే హిందూ మహాసముద్రంలో అమెరికా సైనిక స్థావరంతో సమ స్య ఉండటంతో.. మారిష్‌సకు భారత్‌ మద్దతుగా నిలిచి యూకేపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలోనే 2025 మేలో డీయెగో గార్సియా సహా చాగో దీవులను మారిష్‌సకు తిరిగిచ్చేందుకు యూకే ఒప్పందం చేసుకుంది. అయితే 99 సంవత్సరాల పాటు అంటే 2124 వరకు మారిషస్‌ ఆ దీవులను యూకేకు లీజు కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం యూకే ఏటా రూ.1,235 కోట్లు (10 కోట్ల పౌండ్లు) అద్దె కింద చెల్లిస్తుంది. ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ఈ దీవుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం మారిష్‌సకు భారత్‌ రూ.6,100 కోట్లు ఆర్థిక సాయం కూడా చేస్తోంది. అక్కడ ఒక శాటిలైట్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందానికి మొదట్లో ట్రంప్‌ కూడా మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు నాలుక మడతేశారు.

అప్పట్లో భారత్‌.. తర్వాత చైనా టార్గెట్‌గా..

హిందూ మహా సముద్రంలో తన మిలటరీ అవసరాల కోసం మొదట్లో డీయెగో గార్సియాలో సాధారణ స్థావరాన్ని, కమ్యూనికేషన్‌ కేంద్రాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. కానీ 1971 భారత్‌-పాక్‌ యుద్ధం, బంగ్లాదేశ్‌ విమోచన సమయంలోని పరిణామాలతో.. భారత్‌ లక్ష్యంగా డీయెగో గార్సియాను పెద్ద సైనిక, వైమానిక స్థావరంగా మార్చింది. ఆ యుద్ధ సమయంలో పాకిస్థాన్‌కు అండగా నిలిచేందుకు అమెరికా ముందుకొచ్చింది. యుద్ధంలో భారత్‌ విజయం సాధించి బంగ్లాదేశ్‌ విముక్తి జరిగిపోవడంతో.. అమెరికాను ఆలోచనలో పడేసింది. భారత్‌ లక్ష్యంగా, హిందూ మహా సముద్రంలో పట్టుకోసం డీయెగో గార్సియాను బలమైన వ్యూహాత్మక సైనిక, వైమానిక స్థావరంగా మార్చింది. ప్రపంచ యవనికపైకి చైనా కూడా పోటీగా దూసుకురావడంతో దీనిని మరింత విస్తరించింది. ప్రస్తుతం అక్కడ బీ2, బీ52 బాంబర్లు, ఎఫ్‌ సిరీస్‌ యుద్ధ విమానాలు, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లతోపాటు సుమారు 5 వేల మంది వరకు బలగాలు ఉన్నట్టు అంచనా.

Updated Date - Jan 21 , 2026 | 07:07 AM