US President Donald Trump: అమెరికా రక్షణ బడ్జెట్ రూ.135 లక్షల కోట్లు!
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:13 AM
తరచూ తన వ్యాఖ్యలతో, ఇటీవల వరుసగా దాడులతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.....
2027 ఏడాది కోసం ఏకంగా 50 శాతం పెంచుతూ ట్రంప్ ప్రతిపాదన
వాషింగ్టన్, జనవరి 8: తరచూ తన వ్యాఖ్యలతో, ఇటీవల వరుసగా దాడులతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తన ‘కలల మిలటరీ’కి పదును పెడుతున్నారు. 2027కు సంబంధించి అమెరికా రక్షణ బడ్జెట్‌ను ఏకంగా 50శాతం పెంచేస్తూ.. రూ.135 లక్షల కోట్ల (1.5 ట్రిలియన్ డాలర్లు) మేర ప్రతిపాదించారు. ప్రస్తుత సంవత్సరం అమెరికా రక్షణ బడ్జెట్ సుమారు రూ.90 లక్షల కోట్లు మాత్రమే కావడం గమనార్హం. శత్రువు ఎవరనే ప్రసక్తే అవసరం లేకుండా అమెరికాను అత్యంత భద్రంగా ఉంచే కలల మిలిటరీ (డ్రీమ్ మిలిటరీ)ని నిర్మించేందుకు బడ్జెట్‌ను పెంచడం తప్పనిసరి అని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఊహించని విధంగా టారి్‌ఫల మార్గంలో అమెరికాకు గణనీయస్థాయిలో ఆదాయం పెరుగుతుందని, రక్షణ బడ్జెట్ పెంపునకు ఊతమిస్తుందని స్పష్టం చేశారు. ఇక మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేసి, ఉత్పత్తులను పెంచడంపై దృష్టిపెట్టాలని అమెరికా ప్రైవేటు రక్షణ రంగ సంస్థలను ట్రంప్ ఆదేశించారు. లాభాలను పెట్టుబడుల కోసం, సంస్థ విస్తరణ కోసం వినియోగించకుండా షేర్ల బైబ్యాక్ వంటివి చేపడితే.. ఆయా సంస్థలకు రక్షణ కాంట్రాక్టులు ఇవ్వబోమని హెచ్చరించారు. అయితే ట్రంప్ వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే మిత్రులు, శత్రువులు అని లేకుండా అన్ని దేశాలతోనూ పేచీలకు దిగారు. ఇలాంటి సమయంలో అమెరికా రక్షణ బడ్జెట్ పెంచితే.. యుద్ధాలకు మరింత ఊతమిచ్చినట్టేనన్న అభిప్రాయం వస్తోంది.