ట్రంప్ గ్రాఫ్ ఢమాల్
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:05 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఆయన రాజకీయ జీవితంలోనే కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఆకాశనంటుతున్న ఇంధన ధరలు...
అత్యంత కనిష్ఠానికి పాపులారిటీ!
వాషింగ్టన్, జూన్ 9: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఆయన రాజకీయ జీవితంలోనే కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఆకాశనంటుతున్న ఇంధన ధరలు, విపరీతంగా పెరుగుతున్న జీవన వ్యయం, 100రోజలుగా సాగుతున్న ఇరాన్ యుద్ధంపై అమెరికన్ ఓటర్లలో వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ప్రముఖ వార్తసంస్థ రాయిటర్స్/ఇప్సోస్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. ట్రంప్ పనితీరును 35ు మందే సమర్థిస్తున్నారు. ఆయన మొదటి విడత పదవీకాలం 2017 డిసెంబర్‌లో నమోదైన 33ు అత్యంత అట్టడుగు రేటింగ్ కాగా.. ఇప్పుడు దాదాపు అదే స్థాయికి ట్రంప్ గ్రాఫ్ పడిపోవడం గమనార్హం. ట్రంప్ ప్రభుత్వంపై దేశ ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి విదేశీ విధానాలు, ఆర్థిక భారాలే కారణమని సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ద్రవ్యోల్బణం అమెరికా ఓటర్లను తీవ్రంగా వేధిస్తున్నాయి. విపరీతంగా పెరిగిన జీవన వ్యయాన్ని అదుపు చేయడంలో ట్రంప్ తీవ్రంగా విఫలమవుతున్నారని ఏకంగా 70ు మంది భావిస్తున్నారు. ట్రంప్‌కు రాజకీయంగా నష్టం కలిగిస్తున్న అంశం ఇదేనని సర్వే పేర్కొంది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి ఏర్పడి, అమెరికా ఇంధన ధరలు అదుపు లేకుండా పెరిగిపోవడంతో రిపబ్లికన్ లీడర్ ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇరాన్‌పై అమెరికా సైనికచర్యను 36ు మంది సమర్థిస్తుండగా, ఈ యుద్ధం వల్ల ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువని 25ు భావిస్తున్నారు.