అమెరికాకు రష్యా డీజిల్
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:37 AM
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే భారీగా సుంకాలు విధిస్తాం అని ప్రపంచ దేశాలను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు.
పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడాక ఆంక్షలు ఎత్తివేసిన ట్రంప్
జెలెన్‌స్కీ ఆగ్రహం..రష్యా దాడులు పెరగొచ్చని ఆందోళన
వాషింగ్టన్, అక్టోబరు 10: రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే భారీగా సుంకాలు విధిస్తాం అని ప్రపంచ దేశాలను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రష్యా డిజిల్‌పై ఆంక్షలు ఎత్తివేశారు. అంతేకాకుండా అమెరికాకు డీజిల్ సరఫరా చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన ఒప్పందం చేసుకున్నారు. తమ దేశంతో పాటు ప్రపంచ దేశాలకు రష్యా డీజిల్ సరఫరా చేసుకోవచ్చు అంటూ అనుమతి ఇచ్చారు. శుక్రవారం పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ ఒప్పందాన్ని ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. ‘పుతిన్‌తో చర్చలు అత్యంత విజయవంతంగా ముగిశాయి. మా ఒప్పందం ప్రకారం తక్షణం 3 లక్షల టన్నుల డీజిల్‌ను అమెరికాకు, ప్రపంచ మార్కెట్లకు రష్యా సరఫరా చేస్తుంది. నవంబరులో మరో 5 లక్షల టన్నులు, ఆ వెంటనే మరో 10 లక్షల టన్నులను సరఫరా చేస్తుంది. ఆ తర్వాత వాళ్ల రిఫైనరీల పరిస్థితిని బట్టి తక్కువ సమయంలోనే అదనంలో మరో 30 లక్షల టన్నులు డీజిల్‌ను రష్యా సరఫరా చేస్తుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ స్పందించింది. అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లకు వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వరకు డీజిల్ సరఫరా చేసేందుకు వీలుగా రష్యాపై ఆంక్షలు ఎత్తివేసింది. అయితే భారీగా పెరిగిన ఇంధనం ధరలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, మధ్యంతర ఎన్నికల్లో అది ప్రభావం చూపుతుందని ఒపీనియన్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ట్రంప్ రష్యాపై ఆంక్షలు సడలించారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. రష్యా దాడులు పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.