కృత్రిమ మేధపై.. సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:05 AM
అత్యాధునిక కృత్రిమ మేధ(అడ్వాన్స్‌డ్ ఏఐ) అభివృద్ధికి సహకారం అందించడం, దీనిపై ప్రభుత్వ స్థాయి ప్రయత్నాలను సమన్వయం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్..
ఏఐ అభివృద్ధికి సహకారం, సమన్వయం కోసం ఏర్పాటు
ఏఐ అభివృద్ధి పారిశ్రామిక విప్లవం కంటే గొప్పది
అత్యాధునిక సాంకేతికతల్లో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగిస్తాం: ట్రంప్
వాషింగ్టన్, అక్టోబరు 4: అత్యాధునిక కృత్రిమ మేధ(అడ్వాన్స్‌డ్ ఏఐ) అభివృద్ధికి సహకారం అందించడం, దీనిపై ప్రభుత్వ స్థాయి ప్రయత్నాలను సమన్వయం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ 9ఎస్‌ఐఎఫ్)’ను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతికతల రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడం, అమెరికన్ల ప్రయోజనాలను కాపాడటం లక్ష్యంగా ఈ ఫోర్స్ పనిచేస్తుందని తెలిపారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. కృత్రిమ మేధ అభివృద్ధి పారిశ్రామిక విప్లవం కంటే గొప్పదని అభివర్ణించారు. కృత్రిమ మేధ మోడల్స్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థలు, వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలను అందించే సంస్థలు, సామాజిక సేవా సంస్థలు, వినియోగదారులు, ఆధ్యాత్మిక సంస్థలతో అమెరికా ప్రభుత్వం తరఫున ఎస్‌ఐఎఫ్ సమన్వయం చేస్తుందని వెల్లడించారు. అన్నివర్గాలను సంప్రదించి, చర్చించి.. ఏఐతో ప్రయోజనాలు, ప్రమాదాలపై 120 రోజుల్లో అధ్యక్ష కార్యాలయానికి నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ జే క్లేటన్ ఈ ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ, ఆర్థిక మంత్రులు పీట్ హెగ్సెత్, స్కాట్ బెసెంట్, శ్వేతసౌధం ఉన్నతాధికారి సూసీ వైల్స్, మరికొందరు ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఏఐ వ్యవస్థల నిబంధనల ఉల్లంఘనలు, హ్యాకింగ్, ఇతర ప్రమాదాలను ఎస్‌ఐఎఫ్ సమీక్షిస్తుంది.