అధ్యక్షుడికి చెప్పకుండానే రెస్క్యూ ఆపరేషన్!
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:14 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి ఆ దేశ అధికారులకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఎప్పుడు ఏం మాట్లాడతారో...
ఎక్కడ చెడగొడతారోనన్న భయంతోనే
వాషింగ్టన్, ఏప్రిల్ 20: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి ఆ దేశ అధికారులకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఏం చేస్తారో తెలియని ట్రంప్ తీరు వల్ల.. ఆయన ప్రభుత్వంలోని అధికారులే కొన్ని కీలక విషయాలను అధ్యక్షుడికి తెలియనీయటం లేదని అమెరికా మీడియా తెలిపింది. ఇరాన్‌లో అమెరికా పైలట్, ఎయిర్‌మెన్ రక్షణ కోసం చేపట్టిన ఆపరేషన్ వివరాలు కూడా ట్రంప్‌కు పూర్తిగా చెప్పలేదని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మిలిటరీ నిర్వహించే సాహసోపేత ఆపరేషన్లను అధ్యక్షుడు ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించేందుకు వైట్‌హౌ్‌సలో సిచ్యుయేషన్ రూమ్ అనే గది ఉంటుంది. ఈ నెల 3నఇరాన్‌లో అమెరికా ఎఫ్-15 ఈ విమానం కూలిపోయింది. అందులోని పైలట్‌ను కొన్ని గంటల్లోనే అమెరికా మిలిటరీ రక్షించగా, కనిపించకుండా పోయిన ఎయిర్‌మెన్ కోసం 4న రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. పలు యుద్ధ విమానాలు, వందల మంది సైనికులు ఆ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. దీనిని సిచ్యుయేషన్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ సమన్వయం చేశారు. వాస్తవానికి ఆ రూమ్‌లో ట్రంప్ ఉండాలి. కానీ, ఉపాధ్యక్షుడు వాన్స్, ఇతర సైనిక అధికారులు మాత్రమే ఉన్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆపరేషన్ సమయంలో ట్రంప్ తన పడక గదిలో నిద్రపోతున్నారని పేర్కొంది. ఆపరేషన్‌లో అధ్యక్షుడిని భాగస్వామిని చేస్తే.. అది పూర్తికాకముందే ఆయన సోషల్‌మీడియాలో ఏవైనా ప్రకటనలు చేస్తే పరిస్థితి ప్రతికూలంగా మారుతుందని సైనిక అధికారులు భయపడ్డారని సమాచారం. అందుకే పూర్తి వివరాలు చెప్పకుండా దాచినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.