Donald Trump: రాజీకి రాకపోతే.. మీకు చుక్కలే!
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:07 AM
సైనిక చర్య ద్వారా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను రాత్రికి రాత్రే అపహరించిన అమెరికా.. తాజాగా క్యూబాకు తీవ్ర హెచ్చరిక జారీచేసింది.
క్యూబాకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
రక్తపు వాంతులు, ముక్కు నుంచి నెత్తురు
మదురో నిర్బంధం వేళ నిస్సహాయ స్థితిలోకి వెనెజువెలా సైనికులు
అమెరికా సోనిక్ ఆయుధం ప్రయోగించిందా?
వాషింగ్టన్, జనవరి 11: సైనిక చర్య ద్వారా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను రాత్రికి రాత్రే అపహరించిన అమెరికా.. తాజాగా క్యూబాకు తీవ్ర హెచ్చరిక జారీచేసింది. వైరం పక్కనబెట్టి రాజీకి రాకపోతే ఆర్థికంగా, చమురుపరంగా క్యూబాను పూర్తిగా ఎండబెడతామని హెచ్చరించింది. ఈ మేరకు ట్రంప్ శనివారం ట్రూత్ సోషల్‌లో పలు పోస్టులు పెట్టారు. ‘క్యూబా ఎన్నో ఏళ్లుగా వెనెజువెలా చమురు, నిధులపైనే ఆధారపడి మనుగడ సాగిస్తోంది. ఇకపై ఆ దేశానికి వెనెజువెలా నుంచి చుక్క చమురుగానీ, నిధులుగానీ అందవు. పరిస్థితి చేయి దాటకముందే మాతో క్యూబా రాజీకి రావటం మంచిది’ అని హెచ్చరించారు. కాగా, మదురోను అమెరికా అపహ రించటాన్ని క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కనెల్ ఖండించారు. హవానాలో శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా చర్య ‘రాజ్య ఉగ్రవాదం’ అని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన ట్రంప్.. తాజాగా క్యూబాకు అల్టిమేటం జారీచేశారు.