ఆయుధాలను వీడండి..లేదంటే మృత్యువును చూడండి
ABN , Publish Date - Mar 01 , 2026 | 02:44 AM
ఇరాన్‌పై భారీ యుద్ధాన్ని ప్రారంభించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పాలకుల నుంచి వచ్చిన హెచ్చరికల నుంచి అమెరికా ప్రజలను..
ఇరానీ దళాలకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్, ఫిబ్రవరి 28: ఇరాన్‌పై భారీ యుద్ధాన్ని ప్రారంభించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పాలకుల నుంచి వచ్చిన హెచ్చరికల నుంచి అమెరికా ప్రజలను కాపాడడమే తమ లక్ష్యమని చెప్పారు. దశాబ్దాల తరబడి అమెరికా ప్రయోజనాలు, ప్రజలకు వ్యతిరేకంగా ఇరాన్ వ్యవహరిస్తోందని, దానిని ఇంకెంతమాత్రం కొనసాగించబోమని తెలిపారు. ఈ సందర్భంగా ఇరాన్ భద్రతా బలగాలకు ట్రంప్ గట్టి హెచ్చరిక చేశారు. ‘‘రివల్యూషనరీ గార్డులు, భద్రతా బలగాలకు ఒకటే చెబుతున్నా. ఆయుధాలను విడిచిపెట్టండి. లేకుంటే మృత్యువును చూస్తారు. ఆయుధాలను విడిచిపెడితే పూర్తి రక్షణ ఇచ్చి గౌరవంగా చూస్తాం. లేకుంటే చావును చూడండి’’ అని స్పష్టం చేశారు. ఇరాన్ క్షిపణులను ధ్వంసం చేస్తామని, క్షిపణుల పరిశ్రమను నేలమట్టం చేస్తామని.. నేవీని నామరూపాలు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో అమెరికన్లను నష్టం జరిగే ప్రమాదం ఉందని అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు. ‘‘వీరులైన అమెరికన్ హీరోలు ప్రాణాలు కోల్పోవచ్చు. గాయపడవచ్చు. యుద్ధంలో ఇలాంటివి తప్పవు. తక్షణ అవసరాల కోసం యుద్ధం చేయడం లేదు. భవిష్యత్తు కోసం, ఉదాత్త ఆశయం కోసం చేస్తున్నాం’’ అని తెలిపారు. ఇరాన్ చేతిలో అణ్వాయుధాలు ఉండకూడదన్నదే అమెరికా దీర్ఘకాలిక విధానమని తెలిపారు. ఇరానియన్లను ఉద్దేశించి మాట్లాడుతూ స్వేచ్ఛ మీ చేతుల్లోనే ఉందని అన్నారు. ‘‘ఇళ్లను వీడొద్దు. ప్రతి చోటా బాంబులు పడతాయి. మేం పని ముగించిన తరువాత ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకోండి’’ అని చెప్పారు.