ఇరాన్‌పై వైట్‌హౌస్‌లో ‘యుద్ధం’
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:00 AM
మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి, అధ్యక్షుడు ట్రంప్‌కు పరాభవం ఎదురవడం, అందుకు ఇరాన్‌పై యుద్ధం కూడా కారణమన్న అంచనాలతో.. వైట్‌హౌస్‌లో పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
ట్రంప్ అడ్వైజర్లు, మంత్రుల మధ్య విభేదాలు?
యుద్ధం చేద్దామంటున్న రక్షణ మంత్రి హెగ్సెత్
శాంతి చర్చలకే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మొగ్గు
మరిన్ని ఆంక్షల కోసం ఆర్థికమంత్రి బెస్సెంట్ పట్టు
వాషింగ్టన్, నవంబరు 7: మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి, అధ్యక్షుడు ట్రంప్‌కు పరాభవం ఎదురవడం, అందుకు ఇరాన్‌పై యుద్ధం కూడా కారణమన్న అంచనాలతో.. వైట్‌హౌస్‌లో పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇరాన్‌పై యుద్ధం కొనసాగించాలా? ముగించాలా? కొనసాగిస్తే ఏం చేయాలి? నిలిపివేయాలనుకుంటే ఎలా చేద్దాం? అన్న అంశాలపై ట్రంప్ సన్నిహితులు, సలహాదారుల్లోనే తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాల నుంచి వివిధ రకాల సూచనలు, ఒత్తిళ్లు వస్తున్నాయి. దీనితో ఇరాన్ అంశంపై వైట్‌హౌజ్‌లో యుద్ధం కొనసాగుతున్న తరహా పరిస్థితి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని కీలక అధికార వర్గాలు ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక ఈ అంశంపై కథనం ప్రచురించింది. అందులోని వివరాల మేరకు.. ఇరాన్‌పై యుద్ధం విషయంలో తొలి నుంచీ విముఖంగా ఉన్న ఉపాధ్యక్షడు జేడీ వాన్స్.. ఇప్పుడు కూడా వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించి, చర్చలతో పరిష్కార మార్గం అన్వేషించాలని ట్రంప్‌పై ఒత్తిడి చేస్తున్నారు. నిజానికి మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. యుద్ధం కొనసాగించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించడం గమనార్హం.
ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కూడా దౌత్యపరమైన పరిష్కారానికే మొగ్గుచూపుతున్నారు. మరోవైపు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, పశ్చిమాసియాలో అమెరికా బలగాలను పర్యవేక్షించే యూఎస్ సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ మాత్రం.. వెంటనే ఇరాన్‌పై భారీస్థాయిలో దాడులు ప్రారంభించాలని భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా విదేశాంగమంత్రి రూబియో, ఆర్థిక మంత్రి బెసెంట్ మాత్రం.. ఇరాన్‌పై మరింత తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించాలంటున్నారు. కాగా, ఇరాన్ అణుకార్యక్రమానికి సంబంధించి ఏ సమాచారం ఇచ్చినా వారికి రూ.188 కోట్లు (20 మిలియన్ డాలర్లు) నజరానాగా ఇస్తామని అమెరికా ప్రకటించింది.