US President Donald Trump: గాజా శాంతి బోర్డులో చేరండి
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:54 AM
ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాలో శాంతి స్థాపన, పరిపాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ శాంతి బోర్డులో...
భారత్‌కు ట్రంప్ ఆహ్వానం
న్యూఢిల్లీ, జనవరి 18: ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాలో శాంతి స్థాపన, పరిపాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ శాంతి బోర్డులో చేరాలని భారత్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల సమగ్ర ప్రణాళికలో ఈ శాంతి బోర్డు కూడా ఒక భాగం. ఈ ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ గతంలోనే పలు షరతులతో ఆమోదం తెలిపాయి. కాల్పుల విరమణను ప్రకటించాయి. గాజా శాంతి బోర్డులో చేరాలంటూ పలు దేశాలు, సంస్థలు, ప్రముఖులను అమెరికా ఆహ్వానించింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండే ఈ బోర్డులో చేరిన, నియమించిన కొందరు సభ్యుల పేర్లను ఇటీవలే ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు, భారత సంతతికి చెందిన అజయ్ బంగా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రంప్ అల్లుడు కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తదితరులు ఈ బోర్డులో ఉన్నారు. శాంతిబోర్డులో చేరాల్సిందిగా అమెరికా ఆహ్వానించిన దేశాల్లో భారత్‌తోపాటు పాకిస్థాన్, బ్రెజిల్, కెనడా, అర్జెంటీనా, కెనడా, ఇటలీ, ఈజిప్ట్, టర్కీ, అల్బేనియా, సైప్రస్, హంగరీ, జోర్డాన్, రొమేనియా తదితర దేశాలు ఉన్నాయి. మరోవైపు గాజా స్థానిక పరిపాలనను, పౌర సంస్థలను పర్యవేక్షించే నేషనల్ కమిటీకి పాలస్తీనా నిపుణుడు డాక్టర్ అలీషాత్‌ను చైర్మన్‌గా నియమించారు. గాజాకు సంబంధించి విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన గాజా ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఐక్యరాజ్యసమితి, బల్గేరియా, టర్కీ, ఖతార్, ఈజిప్ట్, యూఏఈ, ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు, ప్రముఖులను నియమించారు.