Iran Trade: ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25శాతం అదనపు సుంకాలు
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:17 AM
ఇన్నాళ్లూ రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయంటూ భారత్‌తోపాటు పలు దేశాలపై అదనపు సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పుడు ఇరాన్‌పై పడ్డారు.
న్యూఢిల్లీ, జనవరి 13: ఇన్నాళ్లూ రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయంటూ భారత్‌తోపాటు పలు దేశాలపై అదనపు సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పుడు ఇరాన్‌పై పడ్డారు. ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపై 25:శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ‘‘ఇరాన్‌తో వాణిజ్యం చేస్తున్న ఏ దేశమైనా సరే అమెరికాకు చేసే ఎగుమతులపై 25శాతం అదనపు సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇదే తుది నిర్ణయం’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ఆంక్షలు, సుంకాలు, ఇతర దౌత్యపరమైన మార్గాల్లో ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌజ్ మీడియా సెక్రెటరీ కరోలిన్ లీవిట్ మంగళవారం వెల్లడించారు. అయితే వైమానిక దాడులు సహా అన్ని ప్రతిపాదనలు సిద్ధంగానే ఉన్నట్టు తెలిపారు. కాగా, ట్రంప్ తాజా సుంకాలతో భారత్‌పై ప్రభావం స్వల్పంగానే ఉండనుంది. ఇరాన్‌తో భారత వాణిజ్యం ఏటా సుమారు రూ.15 వేల కోట్లు (1.7 బిలియన్ డాలర్లు) మాత్రమే. ప్రస్తుతం ఇరాన్‌కు భారత్ నుంచి ప్రధానంగా మందులు, తృణధాన్యాలు, పశుదాణా, టీ, కాఫీ, పండ్లు, కూరగాయలు, నట్స్, ఆర్గానిక్ రసాయనాలు, ఎగుమతి అవుతున్నాయి. ఆ దేశం నుంచి చమురు, ఖనిజ ఆధారిత ఇంధనాలు, శుద్ధీకరణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం.
ప్రతీకార చర్యలు చేపడతాం: చైనా
ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములు చైనా, యూఏఈ, ఇరాక్ దేశాలే. ముఖ్యంగా ఇరాన్ నుంచి చైనాకు చవకగా చమురు సరఫరా అవుతుంది. తాజా ట్రంప్ అదనపు టారిఫ్‌ల ప్రభావం చైనాపై ఎక్కువగా ఉండనుంది. దీనితో చైనా స్పందించింది. ‘‘ఇరాన్‌తో వాణిజ్యం విషయంలో చైనా ప్రయోజనాలు, చట్టబద్ధమైన హక్కులను రక్షించుకునేందుకు చర్యలు చేపడతాం. అవసరమైతే ప్రతీకార చర్యలకూ దిగుతాం’’ అని హెచ్చరించింది. నిజానికి మదురో హయాంలో వెనెజువెలాతో చైనా సంబంధాలు బలోపేతం అయ్యాయి. గత ఏడాది వెనెజువెలా నుంచి రోజుకు 4లక్షల బ్యారెళ్ల చొప్పున చమురు తక్కువ ధరకే చైనాకు సరఫరా అయింది.