ట్రంప్‌పై అమెరికన్ల రుసరుస!
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:01 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఆ దేశ పౌరులు రుసరుసలాడుతున్నారు. ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను సగటున 58 శాతం మంది తీవ్రంగా....
న్యూయార్క్, ఏప్రిల్ 25: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఆ దేశ పౌరులు రుసరుసలాడుతున్నారు. ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను సగటున 58 శాతం మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్‌పై యుద్ధం చేస్తుండడం.. తద్వారా పెరిగిన చమురు ధరలను ప్రస్తావిస్తూ ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపైనా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు గతవారం ప్రముఖ విశ్వవిద్యాలయం మార్క్వేట్ లా స్కూల్ నిర్వహించిన పోలింగ్ స్పష్టం చేసిందని మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఏడాది కిందట 39 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 28 శాతానికి తగ్గిపోయింది. ఇదిలావుంటే, ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీలోనూ ఆయన మద్దతుదారులు తగ్గుతున్నారు. అయినప్పటికీ.. 80 శాతం మేరకు మద్దతు పలుకుతున్నారు. అయితే వీరిలోనూ సగం మంది ఆర్థిక వ్యవస్థపై ఆందోళనగా ఉన్నారు.