కొత్త మార్గంలో టారిఫ్‌లకు ట్రంప్ సన్నద్ధం
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:20 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై విధించిన అడ్డగోలు సుంకాలను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అడ్డదారిలో సుంకాలు వేసేందుకు ఆయన సన్నద్ధం అవుతున్నారు.
భారత్‌పై భారం పడే అవకాశం
వాషింగ్టన్, జూన్ 22: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై విధించిన అడ్డగోలు సుంకాలను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అడ్డదారిలో సుంకాలు వేసేందుకు ఆయన సన్నద్ధం అవుతున్నారు. ఇందుకోసం ఆయన 1974 వాణిజ్య చట్టంలోని 301 సెక్షన్‌ను ప్రయోగిస్తారని తెలుస్తోంది. అందులో 1) వెట్టిచాకిరి ద్వారా తయారైన వస్తువుల దిగుమతిని నిషేధించని దేశాలు లేదా నిషేధించినా సరిగా అమలు చేయని దేశాలు, 2) అదనపు పారిశ్రామిక సామర్థ్యం కలిగిన దేశాలపై(పరోక్షంగా అమెరికాతో వాణిజ్య మిగులు ఉన్న దేశాలు) ప్రత్యేక సుంకాలు విధించేందుకు అవకాశం ఉంది. దాంతో కొన్ని దేశాలపై ఈ పేరుతో సుంకాలు విధించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు అమెరికా బృందాలు ఆయా దేశాల్లో పర్యటించి ఒక నిర్ధారణకు వస్తాయి. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం అన్ని దేశాల మీద 1974 పన్ను చట్టం 122 సెక్షన్ కింద తాత్కాలికంగా 10శాతం ఏకరూప సుంకాన్ని అధికంగా విధించింది. దాని గడువు కూడా జూలై 24తో ముగుస్తుంది. అందుకే ట్రంప్ ప్రత్యామ్నాయాన్ని ఆశిస్తున్నారు. 301 సెక్షన్ కింద వెట్టి చాకిరి నిబంధన కింద 12.5శాతం సుంకం ఉండొచ్చని అంచనా. అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఫిలిప్పీన్, పాకిస్థాన్, మయన్మార్, దక్షిణాఫ్రికా, లావోస్ దేశాలు లాభపడే అవకాశం ఉంది. ఎక్కువగా నష్టపోయే దేశాల్లో సింగపూర్ ఒకటి. ప్రపంచంలో చాలా దేశాల సరకు సింగపూర్ వచ్చి ఆ దేశం ముద్ర వేసుకొని ప్రపంచ వాణిజ్యానికి వెళుతుంది. కాబట్టి వెట్టిచాకిరి, అదనపు సామర్థ్యం అంశాలు సింగపూర్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. భారత్, చైనా లాంటి పెద్ద దేశాలన్నింటి మీదా వెట్టి చాకిరి సుంకం 12.5 శాతం పడే అవకాశం ఉంది.