ఇక.. క్యూబా వంతు!
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:04 AM
వెనిజువెలాను స్వాధీనం చేసుకుని, ఇరాన్‌పై యుద్ధం సాగిస్తున్న అమెరికా ఇప్పుడు ద్వీప దేశం క్యూబాపై దృష్టిసారించింది.
ఏమైనా చేయగలను: ట్రంప్
ఆంక్షలతో ద్వీపదేశం ఉక్కిరిబిక్కిరి
కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ
అంధకారంలో 96 లక్షల మంది
న్యూఢిల్లీ, మార్చి 17: వెనిజువెలాను స్వాధీనం చేసుకుని, ఇరాన్‌పై యుద్ధం సాగిస్తున్న అమెరికా ఇప్పుడు ద్వీప దేశం క్యూబాపై దృష్టిసారించింది. ఈ దేశంపై ఇప్పటికే భారీ ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం.. దీనిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. క్యూబాలో రాజకీయ మార్పు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ విషయంపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. క్యూబాపై నియంత్రణ సాధించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు. ‘‘క్యూబాను స్వాధీనం చేసుకునే గొప్ప గౌరవం నాకు లభించిందని భావిస్తున్నాను. క్యూబాను నేనేమైనా చేయగలను.’’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. ‘‘ఆ దేశాన్ని స్వేచ్ఛగా వదిలేయగలను. లేదా స్వాధీనం చేసుకోగలను. ఆ దేశంతో నేను ఏం చేయాలని అనుకుంటే అది చేయగలను. ఒప్పందం కోసం క్యూబా ఎదురు చూస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని ముగించిన వెంటనే ఏదైనా చేస్తా.’’ అని అన్నారు. ఇదిలావుంటే.. గత కొన్ని వారాలుగా అమెరికా విధించిన చమురు ఆంక్షల నేపథ్యంలో క్యూబాలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. దాదాపు 96 లక్షల మంది ప్రజలు అంధకారంలోనే జీవిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు కమ్యూనిస్టు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ‘‘అమెరికా ఆంక్షల కారణంగా గత మూడు నెలలుగా ఒక్క చుక్క కూడా చమురు మా దేశానికి రాలేదు.’’ అని క్యూబా అధ్యక్షుడు మిగెల్ దియాజ్ కానెల్ తెలిపారు. క్యూబా నుంచి తమకు అసాధారణ ముప్పు పొంచి ఉందని ట్రంప్ చెబుతున్నారు.
వెనిజువెలాకు 51వ రాష్ట్ర హోదా!
వెనిజువెలా అధ్యక్షుడు మదురో దంపతులను జనవరి 3న అరెస్టు చేసిన తర్వాత ట్రంప్.. ఆ దేశాన్ని అమెరికా 51వ రాష్ట్రంగా ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ విషయంపై ఆయన మరింత గట్టిగా స్పందించారు. ప్రపంచ బేస్‌బాల్ సెమీఫైనల్ పోటీల్లో ఇటలీని వెనిజువెలా క్రీడాకారులు 4-2 తేడాతో ఓడించడం పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘వెనిజువెలాకు ఈ మధ్య అంతా మంచే జరుగుతోంది. అసలు ఈ మాయ ఏమిటో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వెనిజువెలాకు 51వ రాష్ట్ర హోదా.. ఎవరైనా కాదనగలరా?.’’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.