US President Trump: కొందామా.. కొట్టేద్దామా?
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:17 AM
ఎన్నో సహజ వనరులకు నెలవైన గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘కు’తంత్రం మొదలుపెట్టారు. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను ఆ దేశం నుంచి ఎత్తుకొచ్చిన తర్వాత గ్రీన్‌ల్యాండ్‌పైనే దృష్టిపెట్టారు.
గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ ‘కు’తంత్రం!.. మంచు ద్వీపాన్ని ఎలాగోలా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు
అవసరమైతే మిలటరీ బల ప్రయోగానికి కూడా ట్రంప్ సిద్ధం: వైట్‌హౌస్
వాషింగ్టన్, జనవరి 7: ఎన్నో సహజ వనరులకు నెలవైన గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘కు’తంత్రం మొదలుపెట్టారు. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను ఆ దేశం నుంచి ఎత్తుకొచ్చిన తర్వాత గ్రీన్‌ల్యాండ్‌పైనే దృష్టిపెట్టారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా పరిధిలోకి తెస్తామని ఎప్పటి నుంచో చెబుతున్న ట్రంప్.. దాన్ని కొనుగోలు చేయడం ద్వారా, లేదా మిలటరీ బలప్రయోగంతో స్వాధీనం చేసుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనికి సంబంధించి అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్ తాజాగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ‘‘అధ్యక్షుడు ట్రంప్, ఆయన బృందం గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాలో భాగంగా చేయడంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అమెరికా శత్రువులను ఎదుర్కొనేందుకు, జాతీయ భద్రత కోసం ఆ ద్వీపాన్ని అమెరికా నియంత్రణలోకి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇందుకోసం గ్రీన్‌ల్యాండ్‌ను మొత్తంగా కొనుగోలు చేయడంతోపాటు మిలటరీ బల ప్రయోగానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు’’ అని వైట్‌హౌజ్ పేర్కొంది. అయితే దౌత్యపరమైన మార్గానికే ట్రంప్ తొలి ప్రాధాన్యత అని.. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేద్దామని భావిస్తున్నారని, ప్రస్తుతానికి బలవంతంగా స్వాధీనం చేసుకునే ఆలోచన ఏదీ లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొనడం గమనార్హం. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా నియంత్రణలోకి తెచ్చుకోవడం అవసరమన్న వైట్‌హౌజ్ ప్రకటన నేపథ్యంలో.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ అయి చర్చించేందుకు డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ సిద్ధమయ్యాయి. త్వరలో భేటీ అవుదామని మార్కో రూబియోకు డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్క్ రాస్మస్సెన్, గ్రీన్‌ల్యాండ్ మంత్రి వివియన్ మోట్జ్‌ఫెల్ట్ విజ్ఞప్తి చేసినట్టుగా గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇంతకుముందు కూడా భేటీకి ప్రయత్నించినా వీలుకుదరలేదని పేర్కొంది. అమెరికా నియంత్రణలోకి వెళ్లే అంశంపై గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్‌తోపాటు యూరప్ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.
సహజ వనరులకు నెలవైన మంచు ఖండం
ఖండాలు కాకుండా భూభాగం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్‌ల్యాండ్. దీనిలో 80ు భూభాగం నిత్యం మంచుతోనే కప్పి ఉంటుంది. ఆర్కిటిక్ ప్రాంతం కావడంతో మిగతా 20ు భూభాగంలోనూ ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటాయి. ప్రస్తుత జనాభా సుమారు 56 వేలు. అధికార భాష గ్రీన్‌ల్యాండిక్. చేపలు, సముద్రపు ఉత్పత్తులే ప్రధాన ఉపాధి. మొదట్లో డెన్మార్క్ వలస పాలనలో ఉండగా.. 1953లో తమ దేశంలో కలిపేసుకుంది. 2009లో రిఫరెండం ద్వారా గ్రీన్‌ల్యాండ్ స్వతంత్ర ప్రతిపత్తి పొందింది. గ్రీన్‌ల్యాండ్‌లో భారీగా బంగారం, వజ్రాలు, సహజవాయువుతోపాటు సీసం, జింక్, కంప్యూటర్ చిప్‌ల రూపకల్పనలో వాడే అరుదైన లోహాల నిక్షేపాలు కూడా ఉన్నాయి.