Donald Trump: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే!
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:38 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తనను తాను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.
ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు
న్యూయార్క్, జనవరి 12: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తనను తాను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ ఖాతాలో ఓ స్ర్కీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. అది వికీపీడియా పేజీని పోలినట్లు రూపొందించిన ఫొటో. అందులో ట్రంప్ ఫొటో కింద ఈ ఏడాది జనవరి నుంచి వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు ఉంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేసే పేరుతో అమెరికా ఇటీవల వెనెజువెలాపై మెరుపుదాడికి చేసిన సంగతి తెలిసిందే. అమెరికా బలగాలు వెనెజువెలా రాజధాని కారకా్‌సపై విరుచుకుపడి.. ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను నిర్బంధించి న్యూయార్క్‌కు తరలించాయి. ట్రంప్ ప్రభుత్వం మదురోపై నార్కో-టెర్రరిజం కుట్ర అభియోగాలు మోపింది. మరోవైపు వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆ దేశ సుప్రీంకోర్టు నియమించగా ఆమె బాధ్యతలు చేపట్టారు. వెనెజువెలా చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్... తమ మాట వినకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుందని ఆమెను హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలో తానే వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడినని ట్రంప్ ప్రకటించుకోవడం చర్చనీయాంశమైంది.