మాకు ఎవరూ అవసరం లేదు
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:08 AM
హోర్ముజ్ జలసంధిని తెరిచి, నౌకలకు భద్రత కల్పించేందుకు రావాలన్న తన పిలుపును ఎవరూ పట్టించుకోకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ముఖ్యంగా ....
వాషింగ్టన్, మార్చి 17: హోర్ముజ్ జలసంధిని తెరిచి, నౌకలకు భద్రత కల్పించేందుకు రావాలన్న తన పిలుపును ఎవరూ పట్టించుకోకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ముఖ్యంగా నాటో దేశాలు మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరూ తమ వెంట రావాల్సిన అవసరం లేదని, అసలు తమకు ఎవరూ అవసరం లేదని వ్యాఖ్యానించారు. మంగళవారం తొలుత దీనిపై ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. అనంతరం ఐర్లాండ్ ప్రధానితో కలిసి వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘పశ్చిమాసియాలో ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యలో భాగస్వామ్యం కావాలని తాము కోరుకోవడం లేదంటూ నాటో మిత్రదేశాలు అమెరికాకు సమాచారం ఇచ్చాయి. ఇరాన్ ఏ రూపంలోనూ, ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదన్న మా ఉద్దేశాన్ని అన్ని దేశాలూ గట్టిగా సమర్థించినా కూడా నాటో దేశాలు ముందుకు రాలేదు. నాకు ఈ నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మేం ఆ దేశాల భద్రత కోసం ఏటా వేల కోట్ల డాలర్లు ఖర్చుపెడుతున్నాం. వాళ్లను కాపాడుతున్నాం. కానీ మాకు అవసరమైన సమయంలో వాళ్లు ముందుకు రారు, ఏమీ చేయరు. అదృష్టవశాత్తు మేం ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్, రక్షణ వ్యవస్థలను, అన్నిస్థాయిల్లో వారి నాయకత్వాన్ని తుడిచిపెట్టేశాం. ఇక ఇప్పుడు మాకు నాటో దేశాల సాయం అవసరం లేదు. ఇప్పుడే కాదు. ఎప్పుడూ లేదు. ప్రపంచంలోనే శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడిగా చెబుతున్నా.. మాకు ఎవరి అవసరమూ లేదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధంలో ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ తమకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. త్వరలోనే హోర్ముజ్ జలసంధి తెరుచుకోనుందని, చమురు ధరలు తగ్గుతాయన్నారు. ఇరాన్‌లో మతవాద ప్రభుత్వం అణచివేతలో 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.