Donald Trump: మీకోసం సాయం వస్తోంది!
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:20 AM
ఇరాన్‌లో ఆందోళనలను మరింతగా రెచ్చగొట్టేలా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు చేస్తూనే ఉండాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోండి
ఇరాన్ ఆందోళనకారులకు ట్రంప్ పిలుపు
వాషింగ్టన్, జనవరి 13: ఇరాన్‌లో ఆందోళనలను మరింతగా రెచ్చగొట్టేలా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు చేస్తూనే ఉండాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాయం అందించేందుకు వస్తున్నామనీ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘‘ఇరాన్ దేశభక్తులారా.. ఆందోళనలు చేస్తూనే ఉండండి. మీ దేశ సంస్థలను స్వాధీనం చేసుకోండి. హింసకు పాల్పడుతున్నవారు, హంతకుల పేర్లు రాసిపెట్టుకోండి. వాళ్లు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇరాన్‌లో ఆందోళనకారులపై చంపడం ఆపేదాకా ఆ దేశ అధికారులతో అన్నిరకాల భేటీలను రద్దు చేస్తున్నాను. మీకోసం సాయం వస్తోంది. మిగా(ఎంఐజీఏ)!!’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా సైనిక చర్యకు సిద్ధమైందని సంకేతాలు అందినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్‌గానీ, వైట్‌హౌజ్ వర్గాలుగానీ దీనిపై ఏ స్పష్టతా ఇవ్వలేదు. ట్రంప్ పోస్టు చివరిలో ‘మిగా’ అని పేర్కొనడం ఆసక్తి రేపుతోంది. అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ‘మాగా(మేక్ అమెరికా గ్రేట్ అగైన్)’ నినాదాన్ని ఎత్తుకున్నారు. గెలిచాక కూడా ఆ పేరిట ఓ ప్రభుత్వ విభాగాన్నే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ‘మిగా’ అని పేర్కొనడంతో.. ఆందోళనకారులకు ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’ అంటూ ఇచ్చిన నినాదంగా కనిపిస్తోంది.