నేడు దోహాలో చర్చలు.. ఇరాన్ వేడుకుందన్న ట్రంప్
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:18 AM
తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా పరస్పరం దాడులు చేసుకుంటున్న అమెరికా-ఇరాన్ ఎట్టకేలకు వెనక్కు తగ్గాయి.
చర్చలకు తేదీ నిర్ణయించలేదన్న ఇరాన్
వాషింగ్టన్, జూన్ 29: తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా పరస్పరం దాడులు చేసుకుంటున్న అమెరికా-ఇరాన్ ఎట్టకేలకు వెనక్కు తగ్గాయి. గత గురువారం నుంచి కొనసాగిన దాడులు ఆదివారం నుంచి ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక శాంతి ఒప్పందంలోని అంశాలపై చర్చించేందుకు మళ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. చర్చల కోసం ఇరాన్ వేడుకుందని, దీంతో ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం రెండు దేశాల ప్రతినిధులు సమావేశమై చర్చలు జరుపుతారని తెలిపారు. అయితే, ఇరాన్ మాత్రం చర్చలకు ఇంకా తేదీ నిర్ణయించలేదని పేర్కొంది. ట్రంప్ మరోసారి తన ధోరణిలో అబద్ధాలు ప్రచారం చేశారని ఇరాన్ చర్చల ప్రతినిధి కజెమ్ ఘరిబాబాదీ విమర్శించారు. కాగా, ఇరుపక్షాలు వెనక్కి తగ్గటంతో హోర్ముజ్‌లో వాణిజ్య నౌకల రాకపోకలు సాధారణంగానే కొనసాగుతున్నాయని అమెరికా నౌకాదళం తెలిపింది.