Share News

హోర్ముజ్‌ దిగ్బంధనాన్ని ఎత్తేస్తున్నాం

ABN , Publish Date - May 30 , 2026 | 03:17 AM

హోర్ముజ్‌ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌ నౌకాశ్రయాలపై తాము కొనసాగిస్తున్న దిబ్బంధనాన్ని త్వరలోనే ఎత్తివేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌....

హోర్ముజ్‌ దిగ్బంధనాన్ని ఎత్తేస్తున్నాం

  • ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారైంది: ట్రంప్‌ ప్రకటన

వాషింగ్టన్‌, మే 29: హోర్ముజ్‌ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌ నౌకాశ్రయాలపై తాము కొనసాగిస్తున్న దిబ్బంధనాన్ని త్వరలోనే ఎత్తివేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఆ ప్రాంతంలో మోహరించిన తమ యుద్ధ నౌకలను ఉపసంహరిస్తామని శుక్రవారం తెలిపారు. ఇరాన్‌తో ఒప్పందం కొలిక్కి వచ్చిందని, త్వరలో అది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ శుక్రవారం సుదీర్ఘ పోస్టు పెట్టారు. 11 నెలల క్రితం ఇరాన్‌ అణు కేంద్రాలపై తమ బీ2 బాంబర్లతో దాడి చేసినప్పుడు శుద్ధిచేసిన యురేనియం అందులోనే ఉండిపోయిందని.. దానిని వెలికి తీసే సాంకేతికత ప్రపంచంలో అమెరికాకు, చైనాకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ వెంటనే స్పందించింది. తమ షరతులకు లోబడి మాత్రమే హోర్ము జ్‌ జలసంధి తెరుచుకుంటుందని స్పష్టంచేసింది. ట్రంప్‌ ప్రకటన సగం నిజాలు, సగం అబద్ధాలతో కూడి ఉందని విమర్శించింది. కాగా, ట్రంప్‌ ప్రభుత్వంలో తన పరపతిని పెంచుకొనేందుకు పాకిస్థాన్‌ ఓ ప్రైవేటు లాబీయింగ్‌ సంస్థతో 1.2 మిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. వాషింగ్టన్‌కు చెందిన ఇర్విన్‌ గ్రేవ్స్‌ స్ట్రాటజీ గ్రూప్‌తో నెలకు 50 వేల డాలర్ల ఫీజు చెల్లించేలా రెండేళ్ల కాలానికి అమెరికాలోని పాక్‌ రాయబార కార్యాలయం ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ఈ నెల 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని తెలిసింది.

Updated Date - May 30 , 2026 | 03:18 AM