Share News

సుంకాలు కొనసాగుతాయి!

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:11 AM

సుంకాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. కోర్టు తీర్పు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని మండిపడ్డారు.

సుంకాలు కొనసాగుతాయి!

  • ప్రత్యామ్నాయ మార్గాల్లో కొనసాగిస్తాం

  • సాధారణ సుంకాలకు అదనంగా మరో 10ు విధిస్తున్నా

  • భారత్‌తో వాణిజ్య ఒప్పందంలో మార్పులు ఉండవు

  • పరస్పర సుంకాల కొట్టివేత అనంతరం ట్రంప్‌ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 20: సుంకాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. కోర్టు తీర్పు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని మండిపడ్డారు. కొందరు న్యాయమూర్తులు విదేశీ శక్తులకు, ఒక చిన్న రాజకీయ ఉద్యమం ప్రభావానికి లోనయ్యారని విమర్శించారు. టారి్‌ఫలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న న్యాయమూర్తులు అమెరికాకు అవమానకరమని, వారితీరు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చాలా ఏళ్లుగా అమెరికాను దోచుకున్న విదేశాలు కోర్టు తీర్పుతో ఆనందపడుతున్నాయని, వారికా సంతోషం ఎక్కువకాలం ఉండదని చెప్పారు. సుంకాల విధింపు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని స్పష్టం చేశారు. శుక్రవారం కోర్టు తీర్పు అనంతరం ట్రంప్‌ వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘కొందరు న్యాయమూర్తులు తాము రాజకీయంగా సరైన పనే చేశామని భావిస్తున్నారు. కానీ వారు వామపక్ష డెమొక్రాట్లకు లోబడిన మూర్ఖులు, పెంపుడు కుక్కలు. వారు దేశభక్తి లేనివారు, రాజ్యాంగంపై విశ్వాసం లేనివారనేది నా అభిప్రాయం. సుంకాల విషయంలో అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈపీఏ)ను మించిన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కోర్టు టారి్‌ఫలను రద్దు చేయలేదు. ఐఈపీఏ కింద విధించిన నిర్దిష్టమైన టారిఫ్‌ విధానాన్ని మాత్రమే రద్దు చేసింది. కోర్టు తప్పుగా తిరస్కరించిన టారి్‌ఫల స్థానంలో.. కోర్టులు, కాంగ్రెస్‌ ఆమోదం ఉన్న ఆ ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేస్తాం. అవి మరింత ఆదాయాన్ని తెచ్చిపెట్టవచ్చు. అమెరికా మరింత శక్తివంతంగా మారుతుంది. వాణిజ్య చట్టం సెక్షన్‌ 122, సెక్షన్‌ 232 కింద అన్ని దేశాలపై ఇప్పుడున్న టారి్‌ఫలకు అదనంగా మరో 10శాతం సుంకాలు విధిస్తున్నాను. వివిధ దేశాలు, సంస్థలు అనుసరిస్తున్న అన్యాయ వాణిజ్య విధానాల నుంచి అమెరికాను రక్షించేందుకు సెక్షన్‌ 301 కింద టారి్‌ఫల విధింపునకు చర్యలను చేపడతాం. ఈ నిర్ణయాలు వెంటనే అమల్లోకి వస్తాయి’’ అని ప్రకటించారు.


భారత్‌తో ఒప్పందంలో మార్పులు ఉండవు

భారత్‌తో వాణిజ్య ఒప్పందంలో ఎటువంటి మార్పులూ ఉండవని, త్వరలోనే ఒప్పందం కుదరబోతోందని ట్రంప్‌ వెల్లడించారు. తాము భారత్‌కు సుంకాలు చెల్లించబోమని, భారత్‌ తమకు సుంకాలు చెల్లించదని పేర్కొన్నారు. తాను టారి్‌ఫలను ఉపయోగించి భారత్‌-పాక్‌ యుద్ధం సహా ఎనిమిది యుద్ధాలను ఆపానని మరోసారి పేర్కొన్నారు. ‘‘ఐఈపీఏ కింద ఏ దేశంపై అయినా నేను ఒక్క డాలర్‌కూడా చార్జి విధించలేనని కోర్టు పేర్కొంది. ఆ చట్టం కింద వివిధ దేశాలతో నేను వాణిజ్యాన్ని ఆపేయవచ్చు. ఆ దేశాలను నాశనం చేసేలా నిషేధం విధించవచ్చు. కానీ చార్జి చేయకూడదా. నేను వాణిజ్యం కోసం లైసెన్సు ఇవ్వొచ్చు. కానీ లైసెన్సు చార్జీ వసూలు చేయకూడదా’’ అని ప్రశ్నించారు.

Updated Date - Feb 21 , 2026 | 02:11 AM