Share News

ఇరాన్‌పై అతి భారీ దాడులు

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:44 AM

ఇరాన్‌పై అతి భారీ స్థాయిలో దాడులు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌ ప్రభుత్వం కూలిపోతుందని భావిస్తున్నానని...

ఇరాన్‌పై అతి భారీ దాడులు

  • అక్కడి ప్రభుత్వం కూలిపోతుంది

  • అవసరమైతే హోర్ముజ్‌ జలసంధిని దాటేందుకు నౌకలకు రక్షణ : ట్రంప్‌

వాషింగ్టన్‌: ఇరాన్‌పై అతి భారీ స్థాయిలో దాడులు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌ ప్రభుత్వం కూలిపోతుందని భావిస్తున్నానని, అయితే ప్రజల వద్ద ఆయుధాలు లేకుంటే ప్రభుత్వాన్ని కూల్చడం కొంత కష్టమని వ్యాఖ్యానించారు. అవసరమైతే హోర్ముజ్‌ జలసంధిని దాటే చమురు ట్యాంకర్లకు తమ నావికా దళంతో రక్షణ కల్పిస్తామని.. అయితే పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలని పేర్కొన్నారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ ప్రభుత్వం కూలిపోతుందా అని ప్రశ్నించగా.. ‘‘ప్రభుత్వం కూలిపోతుంది. అయితే అది వెంటనే జరుగుతుందని చెప్పలేం. ఇరాన్‌ ప్రజల వద్ద ఆయుధాలు లేకపోవడం పెద్ద ఆటంకంగా మారింది. ప్రజల వద్ద ఆయుధాలు లేకుంటే ప్రభుత్వాన్ని కూల్చడం కొంత కష్టం’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ కొత్త సుప్రీంలీడర్‌ మొజ్తాబా ఖమేనీ గాయపడి ఉండొచ్చని, లేదా ఏదో ఒక విధంగా ఇంకా బతికే ఉండొచ్చని వ్యాఖ్యానించారు. వారు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని, వారి సామర్థ్యమేంటో చూపించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక ఇరాన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కొంత మేర సాయం చేస్తున్నారేమోనని అనిపిస్తోందని చెప్పారు. అదే సమయంలో ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేస్తోందనే భావన కూడా ఆయనలో ఉండవచ్చని పేర్కొన్నారు. ఇరాన్‌ వద్ద ఉన్న యురేనియాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్‌ ఏదీ చేపట్టడం లేదని, ఇంకా దానిపై దృష్టిపెట్టడం లేదని ట్రంప్‌ చెప్పారు. అంతకుముందు ఇరాన్‌ లొంగిపోబోతోందని, క్యాన్సర్‌ చీడ పీడ విరగడ కాబోతోందని జీ7 దేశాల నేతలతో ట్రంప్‌ పేర్కొన్నారని యాక్సియోస్‌ తెలిపింది.

Updated Date - Mar 14 , 2026 | 04:44 AM