ఐసిస్ అగ్రనేత మైనుకిని నైజీరియాలో చంపేశాం
ABN , Publish Date - May 17 , 2026 | 05:07 AM
ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ అగ్ర నాయకుడు అబు బాకర్ అల్ మైనుకిని నైజీరియాలో శుక్రవారం చంపివేసినట్లు అమెరికా...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్, మే 16: ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ అగ్ర నాయకుడు అబు బాకర్ అల్ మైనుకిని నైజీరియాలో శుక్రవారం చంపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం ప్రకటించారు. నైజీరియా బలగాలతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో అతడు చనిపోయినట్లు వెల్లడించారు. ఐసిస్‌లో మైనుకి నాయకత్వ స్థాయిలో రెండోస్థానంలో ఉన్నాడు. ఆఫ్రికాలో దాక్కుంటే క్షేమంగా ఉంటానని మైనుకి భావించాడని.. కానీ, తమ నిఘా వ్యవస్థ అక్కడ కూడా ఉంటుందని తెలుసుకోలేకపోయాడని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నాడు. మైనుకి మృతిని నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు కూడా ధ్రువీకరించారు. మరోవైపు, గాజాలో హమాస్ మిలిటరీ కమాండర్ ఇజ్ అల్ దిన్ అల్ హదాద్‌ను చంపివేసినట్లు ఇజ్రాయెల్ శనివారం ప్రకటించింది. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మెరుపు దాడులకు ప్రణాళిక రచించిన ఉగ్ర కమాండర్లలో హదాద్ ఒకడు. తమ దాడుల్లో హదాద్‌తోపాటు అతడి భార్య, కూతురు కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హదాద్ మృతిని హమాస్ కూడా ధ్రువీకరించింది.