Share News

దిగ్గజ ఐటీ కంపెనీలపై ట్రంప్‌ కత్తి

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:12 AM

తమ తమ కంపెనీల్లోని విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించే ‘పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌’ నుంచి 8 దిగ్గజ ఐటీ సంస్థలను అమెరికా ప్రభుత్వం తొలగించింది.

దిగ్గజ ఐటీ కంపెనీలపై ట్రంప్‌ కత్తి

  • విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేయకుండా ఆంక్షలు

  • ‘పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌’ నుంచి 8 కంపెనీల సస్పెన్షన్‌

  • వాటిలో కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, టాటా, విప్రో, హెచ్‌సీఎల్‌, క్యాప్‌జెమినీ, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌

  • అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా చవకగా విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయని ఆరోపణ

  • విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ మరో పిడుగు.. 500 డాలర్లున్న ఓపీటీ ఫీజు 70 వేల డాలర్లకు పెంపు

వాషింగ్టన్‌, అక్టోబరు 8: తమ తమ కంపెనీల్లోని విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించే ‘పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌’ నుంచి 8 దిగ్గజ ఐటీ సంస్థలను అమెరికా ప్రభుత్వం తొలగించింది. వీటిలో కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, టాటా, విప్రో, హెచ్‌సీఎల్‌, క్యాప్‌జెమినీ, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌ ఉన్నాయి. ఈ కంపెనీల నుంచి ఇప్పటికే పరిగణనలో ఉన్న ప్రతిపాదనలుగానీ, కొత్త ప్రతిపాదనలుగానీ వేటినీ ఆమోదించబోమని అమెరికా కార్మికశాఖ మంత్రి కీత్‌ సాండర్లింగ్‌ ప్రకటించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, అటార్నీ జనరల్‌ టాడ్‌ బ్లాంచ్‌తో కలిసి గురువారం ఆయన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ‘యూఎస్‌ యాంటీ ఫ్రాడ్‌ టాస్క్‌ ఫోర్స్‌’లో భాగంగా ఆయా కంపెనీలపై ఈ చర్యలు చేపట్టామన్నారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలైన కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, టాటా, విప్రో, హెచ్‌సీఎల్‌, క్యాప్‌జెమినీలను పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నాం. పలు దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌లను కూడా తొలగిస్తున్నాం. 2009 నుంచి ఈ కంపెనీలు దాదాపు 30 లక్షల మంది విదేశీ ఉద్యోగులకు అమెరికాలో అవకాశం కల్పించేందుకు దరఖాస్తులు సమర్పించాయి. ఈ కంపెనీలకు 2,30,000 హెచ్‌-1బీ వీసా అప్రూవల్స్‌, లక్షకుపైగా పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్లు లభించాయి’ అని తెలిపారు. అమెరికన్‌ ఉద్యోగుల నుంచి లక్షలాది ఉద్యోగాలను ఈ కంపెనీలు లాగేసుకున్నాయని సాండర్లింగ్‌ దుయ్యబట్టారు.


దుర్వినియోగంలో మైక్రోసాఫ్ట్‌ టాప్‌

జేడీ వాన్స్‌ మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ తీవ్రమైన అవినీతికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కంపెనీ నుంచి తొలగించిన ప్రతీ ఉద్యోగి స్థానాన్ని ఒకటిన్నర మంది విదేశీ ఒప్పంద కార్మికులతో భర్తీ చేశారని తెలిపారు. ‘తగిన నైపుణ్యం లేదన్న కారణంతో 2025లో మైక్రోసాఫ్ట్‌ 6 వేల మంది అమెరికన్లను ఉద్యోగాల్లోంచి తొలగించింది. ఇదే సమయంలో ఆ కంపెనీ 6 వేల హెచ్‌-1బీలను ఆమోదించింది. 3,682 పెర్మ్‌ దరఖాస్తులు సమర్పించింది. అమెరికా చరిత్రలోనే వీసా వ్యవస్థను మైక్రోసాఫ్ట్‌ అంతగా దుర్వినియోగం చేసిన కంపెనీ మరొకటి లేదు’ అని నిప్పులు చెరిగారు. హెచ్‌-1బీ వీసా మీద ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న విదేశీయులను ‘ఒప్పంద బానిసలుగా’, కంపెనీలను ‘వీసా మిల్లులు’గా వాన్స్‌ అభివర్ణించారు. ఈ కంపెనీలు ఏదో ఒక చిన్న పట్టణంలో ఉన్న పత్రికల్లో ఉద్యోగ ప్రకటన వేసి, అమెరికన్లు ఎవరూ స్పందించలేదని కార్మికశాఖకు చెబుతాయని, ఆ తర్వాత విదేశాలకు చెందిన ఒప్పంద బానిసలను ఉద్యోగాల్లో నియమించుకుంటాయని ఆరోపించారు.


అమెరికా జీవన విధానానికి అవమానకరం

యేల్‌, హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌, కాల్‌టెక్‌ తదితర 9 ప్రధాన యూనివర్సిటీలు విదేశీ పరిశోధకులను అమెరికాకు రప్పించటం కోసం వినియోగిస్తున్న జే-1 వీసా ప్రోగ్రాంపైన దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు జేడీ వాన్స్‌ ప్రకటించారు. అమెరికన్‌ విద్యార్థులు, పరిశోధకులకు నష్టం కలిగించే విధంగా ఈ వర్సిటీలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఇదంతా అమెరికా కార్మికులకు, అమెరికా జీవనవిధానానికి అవమానకరంగా తయారైందని, అమెరికా ఉద్యోగుల వేతనాలకు, ఉద్యోగాలకు కోత విధించేలా రూపొందించిన వీసా విధానాలను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. కాగా, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌’ పురస్కారానికి ఈసారి మైక్రోసాఫ్ట్‌ ఎంపికైంది. ఆ సంస్థ సీఈఓ సత్యా నాదెళ్లకు ట్రంప్‌ ఆ మెడల్‌ను బహుకరించటానికి కొన్ని గంటల ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, కార్మికశాఖ మంత్రి సాండర్లింగ్‌ మైక్రోసాఫ్ట్‌ మీద దుమ్మెత్తిపోయటం గమనార్హం.


విదేశీ విద్యార్థులపై మరో పిడుగు

అమెరికాలో విదేశీ విద్యార్థులు ఉద్యోగం చేయటానికి అవకాశం కల్పించే ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌’ (ఓపీటీ) ఫీజును ప్రస్తుతం ఉన్న 500 డాలర్ల (రూ.48 వేలు) నుంచి ఏకంగా 70 వేల డాలర్లకు (రూ.67.75 లక్షలు) పెంచేందుకు ట్రంప్‌ సర్కార్‌ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం బుధవారం ఉన్నత విద్యాసంస్థలకు ఒక ప్రతిపాదన పంపింది. దీని ప్రకారం, విదేశీ విద్యార్థులు విద్యాభ్యాసం అనంతరం ఓపీటీ కింద ఉద్యోగం చేయటానికి సదరు విద్యాసంస్థ సిఫారసు చేస్తే.. ఒక్కో విద్యార్థికి 70 వేల డాలర్ల చొప్పున ప్రభుత్వానికి తొలి ఏడాది చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెన్యువల్‌ కోసం ఏటా మరో 30 వేల డాలర్ల (రూ.29 లక్షలు) చొప్పున చెల్లించాలి. ఈ ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని హోంల్యాండ్‌ సెక్యూరిటీ సూచించింది. అమెరికాలో విద్యాభ్యాసం చేసే విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. 2024-25లో 3.63 లక్షల మంది భారతదేశ విద్యార్థులు అమెరికాలో పలు కోర్సుల్లో చేరారు. ఓపీటీ ఫీజు పెంపు ప్రభావం వీరి మీద తీవ్రంగా ఉండనుంది.

Updated Date - Oct 09 , 2026 | 06:07 AM