International Relations: మోదీ ఫోన్ చేయలేదు.. ట్రేడ్ డీల్ కుదరలేదు..
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:33 AM
భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఫోన్ చేసి మాట్లాడకపోవటం వల్లే రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరలేదని అమెరికా వాణిజ్య మంత్రి......
అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లుట్నిక్ వ్యాఖ్య
భారత్‌కు మూడు వారాల సమయం ఇచ్చాం
చర్చల ముగింపు దశలో ట్రంప్‌నకు కాల్ చేయాలని కోరాం
కానీ ట్రంప్‌నకు మోదీ ఫోన్ చేయలేదు
అందుకే ఒప్పందం నిలిచిపోయిందని వెల్లడి
లుట్నిక్ వ్యాఖ్యల్లో నిజం లేదు: భారత్
న్యూయార్క్, జనవరి 9: భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఫోన్ చేసి మాట్లాడకపోవటం వల్లే రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరలేదని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత ఒప్పందం కొలిక్కి వచ్చిందని, ఆ దశలో ఒప్పందం కుదరాలంటే ట్రంప్‌నకు మోదీ ఫోన్‌చేసి మాట్లాడాల్సి ఉండగా.. అది వారికి (భారత్‌కు) నచ్చకపోవటంతో ఒప్పందం ఆగిపోయిందని చెప్పారు. ‘ఆల్ ఇన్ పాడ్‌కాస్ట్’ సంస్థకు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. .‘భారత్ గురించి మీకో విషయం చెబుతాను. బ్రిటన్‌తో నేను మొదటి ఒప్పందం కుదిర్చాను. మీకు (బ్రిటన్‌కు) రెండు వారాల సమయమే ఉందని, ఆ తర్వాత రైలు వేరే స్టేషన్ (దేశానికి)కు వెళ్లిపోతుందని వారితో నేను చెప్పాను. ఎందుకంటే నేను ఒప్పందాలు చేసుకోవాల్సిన దేశాలు చాలా ఉన్నాయి. ఎవరు ముందుగా వస్తే వారికే మంచి డీల్ దక్కుతుంది. యూకే తో ఒప్పందం కుదిరిన అనంతరం ఏ దేశంతో డీల్ ఉంటుందని ట్రంప్‌ను అందరూ అడిగారు. ఆయన ఎన్నో దేశాలతో చర్చించినప్పటికీ తర్వాత డీల్ భారత్‌తో ఉంటుందని బహిరంగంగానే చెప్పారు. మేము భారత అధికారులతో మాట్లాడి ఒప్పందం చేసుకోవటానికి మూడు వారాల సమయం మాత్రమే ఉందని చెప్పాం. నిజానికి అది స్పష్టంగా ట్రంప్ డీల్. ఆయనే ఈ చర్చలు మొత్తాన్ని నడిపించారు. దీంతో చివరగా ట్రంప్‌నకు మోదీ ఫోన్ చేసి మాట్లాడితే ఒప్పందం ఖరారవుతుందని నేను వారితో చె ప్పాను. కానీ మోదీ కాల్ చేయలేదు. ఆ తర్వాత మేము ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, వియత్నాంలతో ఒప్పందాలు చేసుకున్నాం. నిజానికి వీటికంటే ముందు భారత్‌తోనే ఒప్పందం జరగాల్సి ఉంది. మేము ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత భారత అధికారులు వచ్చి ఒప్పందానికి సిద్ధమని చెప్పారు. కానీ, ఎంత రేటుకు అని నేను అడిగా. త్రాసులో భారత్ సరైన వైపున ఉండలేదు. అందుకే వాణిజ్య ఒప్పందం కుదరలేదు’ అని లుట్నిక్ వివరించారు.
కాగా, లుట్నిక్ వాఖ్యలను భారత్ ఖండించింది. ట్రంప్‌నకు మోదీ ఫోన్ చేయకపోవటం వల్లనే భారత్,అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదన్నది వాస్తవం కాదని విదేశాంగశాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 13వ తేదీ నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు పలు దఫాలుగా జరిగాయని, కొన్ని విషయాల్లో అంగీకారం కుదరకపోవటంతో ఒప్పందం సాధ్యం కాలేదని వెల్లడించారు.