Share News

స్టీరింగ్‌ వీల్‌, బ్రేక్‌ పెడల్‌ ఉండవ్‌!

ABN , Publish Date - Sep 05 , 2026 | 06:04 AM

ఎంత సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు అయినా.. అత్యవసర పరిస్థితుల్లో కారును మనుషులు తమ నియంత్రణలోకి తీసుకోవడానికి స్టీరింగ్‌ వీల్‌, బ్రేకు, యాక్సిలరేటర్‌ వంటివి ఉంటాయి. కానీ..

స్టీరింగ్‌ వీల్‌, బ్రేక్‌ పెడల్‌ ఉండవ్‌!

  • ఇది టెస్లావారి కొత్త ట్యాక్సీ

  • ఆస్టిన్‌ నగర వీధుల్లో సేవలు అందించనున్న 45 సైబర్‌ క్యాబ్‌లు

ఆస్టిన్‌, సెప్టెంబరు 4: ఎంత సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు అయినా.. అత్యవసర పరిస్థితుల్లో కారును మనుషులు తమ నియంత్రణలోకి తీసుకోవడానికి స్టీరింగ్‌ వీల్‌, బ్రేకు, యాక్సిలరేటర్‌ వంటివి ఉంటాయి. కానీ.. అవేవీ లేని రెండు సీట్ల సైబర్‌క్యాబ్‌లను.. ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ ఆస్టిన్‌ నగర వీధుల్లోకి ప్రవేశపెట్టింది. అయితే, కార్పొరేట్‌ ఈవెంట్‌ ప్రదర్శనలో భాగంగా మాత్రమే ఆ కార్లు వీధుల్లోకి వచ్చాయి. ప్రజలకు ట్యాక్సీ సేవలు అందించేందుకు మొత్తం 45 సైబర్‌ క్యాబ్‌లను శనివారం నుంచి అందుబాటులోకి తేనున్నట్టు టెస్లా వెల్లడించింది. బంగారు రంగులో ఉండే ఈ ట్యాక్సీలు ప్రస్తుతానికి కేవలం ఆస్టిన్‌ నగర పరిధిలో మాత్రమే తిరుగుతాయి. వాహనాలు అత్యధిక వేగంతో వెళ్లే జాతీయ రహదారులపైకి ఎక్కడానికి వీటికి అనుమతి లేదు. అలాగే.. 13ఏళ్లలోపువారు వాటిని ఎక్కడానికి వీల్లేదు. 13-17ఏళ్లవారు తోడుగా పెద్దలెవరైనా ఉంటే ఎక్కొచ్చు. అయితే.. ప్రయాణికులు నిజంగానే వీటిలో ఎలాంటి భయమూ లేకుండా ఎక్కుతారా? అనేదే ప్రశ్న. ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో ఏడుగురు డ్రైవర్‌లెస్‌ కారులో ప్రయాణించడానికి తాము ఇష్టపడబోమని చెప్పారు. నిజానికి గత ఏడాది జూన్‌ నుంచే టెస్లా సంస్థ ఆస్టిన్‌ నగరంలో డ్రైవర్‌ లేని రోబోట్యాక్సీ సర్వీసులను నడుపుతోంది. తర్వాత ఆ సేవలను మరో ఐదు నగరాలకు విస్తరించింది. కానీ.. అవన్నీ స్టీరింగ్‌వీల్‌, బ్రేక్‌, యాక్సిలరేటర్‌ పెడల్స్‌ ఉన్న కార్లు. వాటిలో ప్రయాణించడానికే ఎక్కువ మంది భయపడుతున్న నేపథ్యంలో.. అవేవీ లేని కారులో ఎక్కడానికి ఇష్టపడతారా అంటే.. చెప్పడం కష్టమే.

Updated Date - Sep 05 , 2026 | 06:14 AM