‘హర్మూజ్’లో యుద్ధ మేఘాలు!
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:10 AM
పశ్చిమాసియాలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓవైపు అమెరికా యుద్ధ నౌకలు, బలగాల మోహరింపు..
ఇటు అమెరికా యుద్ధ నౌకలు, బలగాల మోహరింపు.. అటు ఇరాన్, రష్యా, చైనా ఉమ్మడి సైనిక విన్యాసాలు
జలసంధిని తాత్కాలికంగా మూసివేసిన ఇరాన్
వాషింగ్టన్/టెహ్రాన్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: పశ్చిమాసియాలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓవైపు అమెరికా యుద్ధ నౌకలు, బలగాల మోహరింపు.. మరోవైపు ఇరాన్, రష్యా, చైనా యుద్ధ నౌకలతో సంయుక్త నావికాదళ విన్యాసాలతో కవ్వింపులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విన్యాసాల కోసమని హర్మూజ్ జలసంధిని ఇరాన్ పాక్షికంగా మూసివేయడమూ కలకలం రేపుతోంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అమెరికా, ఇరాన్ చర్చలు సానుకూలంగానే జరిగాయని చెబుతున్నా.. కీలకమైన అణుశుద్ధి నిలిపివేత, క్షిపణుల గరిష్ఠ సామర్థ్యంపై పరిమితులు వంటి అంశాలను ఇరాన్ అంగీకరించకపోవడం ఆందోళన రేపుతోంది. అణుశుద్ధి విషయంలో ఇరాన్ దిగిరాకపోతే యుద్ధం మొదలుపెట్టేందుకు అమెరికా సిద్ధమైందని.. కనీసం రెండు, మూడు వారాల పాటు యుద్ధం కొనసాగేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అమెరికా రక్షణ వర్గాలను ఉటంకిస్తూ ఆక్సియోస్ న్యూస్, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తాజాగా కథనాలు ప్రచురించాయి. ఇరాన్‌కు సమీపంగా ఇప్పటికే యూఎ్‌సఎస్ లింకన్ విమాన వాహక యుద్ధ నౌకను మోహరించిన అమెరికా మరిన్ని బలగాలను పశ్చిమాసియా వైపు తరలిస్తోంది. మదురోను అదుపులోకి తీసుకునే సమయంలో కరీబియన్ ప్రాంతంలో మోహరించిన యూఎ్‌సఎస్ జెరాల్డ్ ఫోర్డ్ యుద్ధ నౌకను, క్షిపణి రక్షణ వ్యవస్థలను పశ్చిమాసియా వైపు పంపింది. తాజాగా 50కిపైగా ఎఫ్-22, ఎఫ్-35, ఎఫ్-16 తరహా యుద్ధ విమానాలు, వాటికి గాల్లోనే ఇంధనం నింపే రీఫ్యూయలింగ్ విమానాలను కూడా యూరప్, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలకు తరలించినట్టు విమాన ట్రాకింగ్ సంస్థలు వెల్లడించాయి. కాగా, స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య మంగళవారం రెండో దశ చర్చలు జరిగాయి. భవిష్యత్తు చర్చలకు సంబంధించిన మార్గదర్శక అంశాలపై ఇందులో కాస్త స్పష్టత వచ్చిందని ఇరాన్ పేర్కొంది.
రష్యా, చైనా, ఇరాన్.. యుద్ధ విన్యాసాలు
ఓవైపు అమెరికా బలగాల మోహరింపు పెరుగుతున్న సమయంలో.. హర్మూజ్ జలసంధిలోని ఇరాన్ నౌకాదళ స్థావరం బందర్ అబ్బాస్ వద్ద ఇరాన్, రష్యా, చైనా ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు చేపట్టాయి. ఇందుకోసం రష్యాకు చెందిన ‘కోర్వెట్ట్ స్టోయికియ్’ యుద్ధ నౌకతో కూడిన బాల్టిక్ ఫ్లీట్ ఇప్పటికే బందర్ అబ్బాస్ స్థావరానికి చేరుకుంది. చైనా కూడా తన నౌకాదళ బృందాన్ని పంపింది. ‘మ్యారీటైమ్ సెక్యూరిటీ బెల్ట్-2026’ పేరిట గురువారం నుంచి మూడు దేశాల ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు ప్రారంభంకానున్నాయి. దీనితో హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. విన్యాసాలు ముగిసిన తర్వాత నౌకలు ప్రయాణించవచ్చని పేర్కొంది.
యుద్ధ నౌకలు మునిగిపోవచ్చు
అమెరికా నౌకాదళం, యుద్ధ నౌకలు అత్యంత భారీగా ఉండొచ్చని.. కానీ ఏదో ఒక సమయంలో అవి అంతే భారీగా దెబ్బతినే పరిస్థితి వస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ పేర్కొన్నారు. భారీ యుద్ధ నౌకలు కూడా మునిగి సముద్రం అడుగుకు చేరవచ్చని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. పౌర అవసరాల కోసం అణుశుద్ధి చేసుకునే హక్కు ఇరాన్ సహా ప్రతి దేశానికీ ఉందని స్పష్టం చేశారు. క్షిపణుల సామర్థ్యంపై నియంత్రణ విధించాలన్న అమెరికా ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ.. క్షిపణుల సామర్థ్యం తగ్గించేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు.