మైనర్లపై లైంగిక వేధింపులు
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:05 AM
మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ తెలుగు వ్యక్తికి అమెరికాలోని ఓ న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని ఆష్‌బర్న్‌లో నివసించే ప్రవాస భారతీయుడు...
అమెరికాలో తెలుగు వ్యక్తికి 20 ఏళ్ల జైలు
(డల్లాస్ నుంచి కిలారు గోకుల్‌కృష్ణ)
మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ తెలుగు వ్యక్తికి అమెరికాలోని ఓ న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని ఆష్‌బర్న్‌లో నివసించే ప్రవాస భారతీయుడు, ఖమ్మం జిల్లాకు చెందిన తాళ్లూరు ఫణి(32) అనే యువకుడికి స్థానిక న్యాయస్థానం బుధవారం శిక్ష ఖరారు చేసింది. అంతేకాక, శిక్ష ముగించుకొని జైలు నుంచి విడుదలైన తర్వాత ఐదేళ్ల పాటు ఫణిపై పర్యవేక్షణ ఉంటుంది. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఫణి.. మైనర్లకు అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు, ఫొటోలు పంపేవాడు. ఓ బాలికకు తన నగ్న చిత్రాలు పంపిన ఫణి.. తిరిగి అలాంటి చిత్రాలను తనకు పంపాలని ఆమెను ఒత్తిడి చేశాడు. దీనిపై బాధితురాలు 2022లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను 11 నుంచి 13 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నప్పుడు ఫణి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యాయనని మరో బాధితురాలు తెలిపింది. అంతేకాక, తన నేరాలను కప్పిపుచ్చేందుకు చాటింగ్ సందేశాలు, ఇతర ఆధారాలను డిలీట్ చేయాలని ఫణి బాధితులపై ఒత్తిడి తెచ్చినట్టు కోర్టు విచారణలో బయటపడింది. దీంతో ఇవి సాధారణ తప్పులు కాదని తెలిసి చేసిన దారుణాలేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే, మద్యపానం అలవాటు, మానసిక సమస్యలు, తల్లి మరణంతో ఎదురైన మానసిక ఆవేదనతో తనకు ఈ పరిస్థితి వచ్చిందని శిక్ష విధించే సమయంలో ఫణి వాదించినప్పటికీ న్యాయస్థానం ఏకీభవించలేదు. కాగా, 2019లోనే ఫణి వ్యవహారం బయటకు రాగా స్థానిక తెలుగు పెద్దలు అప్పట్లో రాజీకి యత్నించారు. కానీ బాలిక తల్లిదండ్రులు రాజీకి అంగీకరించకపోవడంతో కేసుల భయంతో ఫణి బారత్ వెళ్లిపోయాడు. రెండేళ్ల అనంతరం మళ్లీ అమెరికా వచ్చాడు. 2022 నుంచి కొనసాగిన దర్యాప్తు ఆధారంగా ఫణి 2024లో అరెస్టయ్యాడు. విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం బుధవారం తుది తీర్పు వెలువరించింది.