Share News

స్విస్‌.. కరుగుతున్న ఐస్‌

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:22 AM

స్విట్జర్లాండ్‌.. ఈ పేరు చెప్పగానే తెల్లటి, చల్లటి మంచుతో కూడిన సుందరమైన ఆల్ప్స్‌ పర్వతాలు గుర్తొస్తాయి! ఆ మంచుకొండల్లో తెలుగు సినిమా హీరో, హీరోయిన్లు వేసిన స్టెప్పులు కూడా గుర్తొస్తాయి!!

స్విస్‌.. కరుగుతున్న ఐస్‌

  • వేగంగా కరిగిపోతున్న స్విట్జర్లాండ్‌ హిమనీనదాలు

  • గడిచిన ఐదేళ్లలో 20శాతం దాకా తగ్గిన పరిమాణం

  • భూతాపంతోనే ఈ పరిస్థితి

  • 2100 నాటికి స్విస్‌ గ్లేసియర్లు 90శాతం మంచును కోల్పోయే ముప్పు

స్విట్జర్లాండ్‌.. ఈ పేరు చెప్పగానే తెల్లటి, చల్లటి మంచుతో కూడిన సుందరమైన ఆల్ప్స్‌ పర్వతాలు గుర్తొస్తాయి! ఆ మంచుకొండల్లో తెలుగు సినిమా హీరో, హీరోయిన్లు వేసిన స్టెప్పులు కూడా గుర్తొస్తాయి!! కానీ.. రుతువులు గతితప్పడంతో ఆ మంచు జాడలు మాయమవుతున్నాయి. శీతాకాలంలో మంచు సరిగ్గా కురవక, ఎండాకాలంలో విపరీతమైన వేడి కారణంగా.. స్విట్జర్లాండ్‌లోని హిమనీనదాలు మునుపెన్నడూ లేనంత వేగంగా కరిగిపోతున్నాయి. ఎంతవేగంగా అంటే.. గడిచిన ఐదేళ్ల కాలంలో స్విట్జర్లాండ్‌లోని హిమనీనదాల్లో దాదాపు 20 శాతం దాకా కరిగిపోయాయి. అందులో 5 శాతానికిపైగా మంచును ఒక్క ఈ ఏడాదిలో కోల్పోయాయి. మరీ ముఖ్యంగా.. ఈ ఏడాది జూలై-సెప్టెంబరు నెలల మధ్య కరిగిన మంచుతో దాదాపుగా 2.2 లక్షల కోట్ల లీటర్ల నీరు ఆ దేశ నదుల్లోకి చేరింది. ఇది ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ తాగునీటి అవసరాలకు వాడే మొత్తం నీటితో పోలిస్తే నాలుగు రెట్లకు పైమాటే. సాధారణంగా.. ఉత్తర, పశ్చిమ, మధ్య ఐరోపా దేశాలను మనం చలిదేశాలుగా వ్యవహరిస్తుంటాం. కానీ.. భూతాపం, పర్యావరణమార్పుల కారణంగా కొన్ని సంవత్సరాలుగా యూరప్‌ ఖండంలోని అన్ని దేశాల్లో రికార్డుస్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. స్విట్జర్లాండ్‌లో కూడా అదే వాతావరణం ఉండడమే హిమనీనదాల్లో మంచు కరిగిపోవడానికి కారణమవుతోందని ‘స్విస్‌ గ్లేసియర్‌ మానిటరింగ్‌ నెట్‌వర్క్‌ (గ్లామోస్‌)’, ‘స్విస్‌ కమిషన్‌ ఫర్‌ క్రయోస్ఫియర్‌, అబ్జర్వేషన్‌ ఆఫ్‌ ద స్విస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ (ఎస్‌సీనాట్‌)’ పరిశోధకులు వెల్లడించారు.


ఈ మేరకు వారు ఇటీవలే ఒక నివేదిక విడుదల చేశారు. 2021 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30 దాకా స్విస్‌ హిమనీనదాలు 20 శాతం మంచును కోల్పోయినట్టు అందులో పేర్కొన్నారు. ఈ నివేదిక విడుదల చేయడం కోసం వారు స్విట్జర్లాండ్‌లోని 23 హిమనీనదాల్లో మంచు పరిమాణాన్ని కొలిచి.. భారీగా మంచును కోల్పోయినట్టు గుర్తించారు. ఉదాహరణకు.. పశ్చిమ ఆల్ప్స్‌ పర్వతాల్లో 9,843 అడుగుల ఎత్తున ఉన్న సస్సెక్స్‌ రోగ్‌ అనే హిమనీనదంలో ఈ ఏడాది జూలైలో 13 అడుగుల మెజరింగ్‌ పోల్‌ పాతారు. మళ్లీ సెప్టెంబరులో అక్కడికి వెళ్లి చూడగా.. ఆ పోల్‌ 10 అడుగుల మేర బయటకు వచ్చి కనిపించింది.


అంటే.. పదడుగుల మందాన మంచును కోల్పోయినట్టు. మొత్తమ్మీద స్విస్‌ హిమనీనదాల సగటు మందం 8 నుంచి 13 అడుగల దాకా తగ్గిపోయిందని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. దీనికి కారణం భూతాపం, మానవుల కారణంగా పర్యావరణంలో వచ్చిన మార్పులేనని వారు స్పష్టం చేశారు. ‘‘చిన్న గ్లేసియర్లలో కొన్ని చాలా త్వరగా కరిగిపోయాయి. కొన్ని పూర్తిగా ఆవిరైపోయాయి. పెద్ద గ్లేసియర్లు కూడా భారీగా మంచును కోల్పోయాయి’’ అని వెల్లడించారు. స్విట్జర్లాండ్‌ దేశం.. స్కీయింగ్‌ వంటి వింటర్‌ స్పోర్ట్స్‌కు, అల్‌పైన్‌ టూరిజానికి ప్రసిద్ధి చెందిందనే విషయం తెలిసిందే. ఆ రెండింటికీ ఆధారమైన హిమనీనదాలు మంచును కోల్పోతుండడం ఆందోళనకరమని.. ఇది పర్యాటకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, పర్యాటక రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న స్విస్‌ ప్రజలు నాలుగు శాతానికిపైగానే ఉంటారని.. వారి పరిస్థితీ అగమ్యగోచరమవుతుందని.. గ్లామోస్‌ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. స్విట్జర్లాండ్‌ విద్యుదుత్పత్తికీ హిమనీనదాలు కీలకమైనవి. వాటిలో మంచు మొత్తం కరిగిపోయి నదుల్లోకి నీరుచేరకపోతే ఇంధన సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. 2100 నాటికి స్విస్‌ హిమనీనదాలు 90శాతం మంచును కోల్పోతాయని హ్యారీ జెకొల్లారి అనే గ్లేషియాలజిస్ట్‌ హెచ్చరించారు.


అలా కాకుండా ఉండాలంటే వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదలను, భూతాపాన్ని తగ్గించుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని.. తద్వారా హిమనీనదాలు కరిగే వేగాన్ని తగ్గించగలుగుతామని ఆయన పేర్కొన్నారు. ఒక్క యూర్‌పలోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా హిమనీనదాలు ఇదే ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. భూతాపానికి అడ్డుకట్ట వేసినా కూడా.. 2100 నాటికి ప్రపంచంలోని అన్ని గ్లేసియర్లూ 25 నుంచి 50ు పరిమాణంలో మాత్రమే మంచును కోల్పోతాయని, వేయకపోతే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇక నుంచి.. పెరిగే ప్రతి 0.1 డిగ్రీ ఉష్ణోగ్రత కూడా మానవాళి మనుగడకు ప్రమాదమేనని పేర్కొన్నారు.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Oct 03 , 2026 | 03:24 AM