Share News

3 రోజుల్లో 600 బిలియన్‌ డాలర్లకు పైగా..స్పేస్‌ ఎక్స్‌ షేర్లు పతనం!

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:40 AM

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించి రోజులైనా గడవకుండానే ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ షేర్లు భారీగా పతనం అయ్యాయి.

3 రోజుల్లో 600 బిలియన్‌ డాలర్లకు పైగా..స్పేస్‌ ఎక్స్‌ షేర్లు పతనం!

  • అదానీ, అంబానీల సంపదకు దాదాపు మూడింతల విలువ!

న్యూఢిల్లీ, జూన్‌ 23: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించి రోజులైనా గడవకుండానే ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ షేర్లు భారీగా పతనం అయ్యాయి. కేవలం మూడు ట్రేడింగ్‌ సెషన్లలోనే 600 బిలియన్‌ డాలర్లకు పైగా మార్కెట్‌ విలువను కోల్పోయాయి. ఇది భారత్‌లోని ఇద్దరు సంపన్న వ్యాపారవేత్తలు ముకేశ్‌ అంబానీ(88.3 బిలియన్‌ డాలర్లు), గౌతమ్‌ అదానీ(120 బిలియన్‌ డాలర్లు)ల సంపదకు దాదాపు మూడు రెట్లు. స్పేస్‌ ఎక్స్‌ షేరు విలువ సోమవారం ఒక్క రోజే 16శాతం పతనమై 154.60 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో నాస్‌డాక్‌లో లిస్టయిన తర్వాత తొలిసారిగా 2 ట్రిలియన్‌ డాలర్ల దిగువకు స్పేస్‌ ఎక్స్‌ మార్కెట్‌ విలువ తగ్గిపోయింది. ఐపీవోకు వచ్చి 75 బిలియన్‌ డాలర్ల సేకరణతో రికార్డులు బద్దలు కొట్టిన కొద్ది రోజులకే ఈ పతనం చోటు చేసుకుంది. తొలుత ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడి పెట్టేందుకు పోటీ పడడంతో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. అయితే తర్వాత సెల్లర్లు లాభాల స్వీకరణకు దిగారని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా స్పేస్‌ ఎక్స్‌ షేర్ల పతనంతో దాని సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఆస్తుల నికర విలువ కూడా బాగా తగ్గిపోయింది. ఈ సంస్థలో 38శాతం వాటా కలిగి ఉన్న ఆయన ఆస్తుల విలువ సుమారు 350 బిలియన్‌ డాలర్లు తగ్గిపోయినట్లు అంచనా. ప్రస్తుతం మస్క్‌ నికర ఆస్తుల విలువ 1.1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

Updated Date - Jun 24 , 2026 | 03:40 AM