Share News

అంతరిక్షంలోకి 10 లక్షల ఉపగ్రహాలు!

ABN , Publish Date - Nov 27 , 2026 | 04:30 AM

కృత్రిమ మేధ(ఏఐ)కు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్‌’ అంతరిక్షంలో 10 లక్షల ఉపగ్రహాలతో భారీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధమైంది.

అంతరిక్షంలోకి  10 లక్షల ఉపగ్రహాలు!

  • కక్ష్యలో ఏఐ డేటాసెంటర్ల ఏర్పాటుకు మస్క్‌ భారీ ప్లాన్‌

  • ‘స్టార్‌మైండ్‌’ పేరిట భారీ ప్రాజెక్టుకు స్పేస్‌ఎక్స్‌ ప్రణాళిక

  • అమెరికా ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ అనుమతి

వాషింగ్టన్‌, నవంబరు 26: కృత్రిమ మేధ(ఏఐ)కు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్‌’ అంతరిక్షంలో 10 లక్షల ఉపగ్రహాలతో భారీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. ‘స్టార్‌మైండ్‌’ పేరిట చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు అమెరికా ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ (ఎఫ్‌సీసీ) ఆమోదం తెలిపింది. అంతరిక్షంలోని సౌరశక్తిని ఉపయోగించుకుని భారీ స్థాయిలో డేటాను అక్కడే ప్రాసెస్‌ చేసి.. దాన్ని తిరిగి భూమికి చేరవేసే ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్టు ఎఫ్‌సీసీ బుధవారం ప్రకటించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు డేటా సెంటర్లు వెన్నెముక లాంటివి. వీటిలోని కంప్యూటింగ్‌ వ్యవస్థలను నడపడానికి, చల్లబరచడానికి అపారమైన విద్యుత్‌ అవసరమవుతుంది. వీటికి ప్రత్యామ్నాయంగా అంతరిక్షంలో 10 లక్షల ఏఐ కంప్యూటింగ్‌ మాడ్యూళ్లను ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది ఆరంభంలోనే స్పేస్‌ఎక్స్‌ అమెరికా ప్రభుత్వ అనుమతి కోరింది. భూమిపై ఉన్న డేటా సెంటర్లకు భారీగా విద్యుత్‌ అవసరమవుతుందని, కాబట్టి అంతరిక్షంలో నిరంతరం అందుబాటులో ఉండే సౌరశక్తిని వినియోగించుకుని డేటా సెంటర్లు నిర్వహించవచ్చని పేర్కొంది. దీనివల్ల ఖర్చులు తగ్గడంతోపాటు భూమిపై విద్యుత్‌ వినియోగం, పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతాయని వివరించింది. దీనికి ఆమోదం తెలపడంతో అంతరిక్ష సాంకేతికత, ఏఐ రంగాల్లో అమెరికా ఆధిపత్యం మరింత పెరుగుతుందని ఎఫ్‌సీసీ చైర్మన్‌ బ్రెండన్‌ కార్‌ అన్నారు. ‘అమెరికా ఈ ప్రపంచాన్ని సూపర్‌ ఇంటెలిజెన్స్‌ యుగంలోకి నడిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో అద్భుత సాంకేతిక అవసరాలను సృష్టించి, పెట్టుబడులను ప్రోత్సహించి, అమెరికా ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు అందించేలా ముందుకు సాగుతోంది. అంతరిక్షంలో డేటా సెంటర్ల కోసం 10 లక్షల ఉపగ్రహాల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయడం ద్వారా ఎఫ్‌సీసీ ఆ ప్రయత్నానికి మరింత ఊపునిచ్చింది’ అని బ్రెండన్‌ కార్‌ తెలిపారు.


స్టార్‌షిప్‌ రాకెట్‌ ద్వారా..

‘స్టార్‌మైండ్‌’ ప్రాజెక్టులో భాగంగా స్పేస్‌ఎక్స్‌ విడతలవారీగా రాకెట్లను కక్ష్యలోకి పంపించాల్సి ఉంటుంది. దీనికోసం ఆ సంస్థ ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న తమ ఐదవ తరం స్టార్‌షిప్‌ రాకెట్‌ను ఉపయోగించాలని భావిస్తోంది. ఎఫ్‌సీసీ నిర్దేశించిన దాని ప్రకారం.. స్పేస్‌ఎక్స్‌ 2033 నవంబరు నాటికి ఉపగ్రహాల ప్రయోగాన్ని ప్రారంభించాలి. 2035 నవంబరు నాటికి అనుమతించిన మొత్తంలో కనీసం 10 శాతం (లక్ష) ఉపగ్రహాలను ప్రయోగించాలి. 2038 నవంబరు నాటికి 50 శాతం (5 లక్షలు) ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.


రేడియో ఫ్రీక్వెన్సీతో బ్యాకప్‌

తమ ఆప్టికల్‌ నెట్‌వర్క్‌ కోసం బ్యాకప్‌ కమ్యూనికేషన్లను ఏర్పాటు చేయాలన్న స్పేస్‌ఎక్స్‌ అభ్యర్థనను కూడా ఎఫ్‌సీసీ ఆమోదించింది. ఈ వ్యవస్థ అత్యవసర టెలిమెట్రీ, ట్రాకింగ్‌, కమాండ్‌ కార్యకలాపాల కోసం, అలాగే ఉపగ్రహ నెట్‌వర్క్‌ అంతటా బ్యాకప్‌ కనెక్టివిటీ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ లింక్‌లను ఉపయోగిస్తుంది. 18.8-19.3 గిగాహెడ్జ్‌ డౌన్‌లింక్‌, 28.6-29.1 గిగాహెడ్జ్‌ అప్‌లింక్‌ బ్యాండ్లలో ఈ సదుపాయం ఉంటుంది. కాగా... ఎఫ్‌సీసీ అనుమతిచ్చిన మొత్తం ఉపగ్రహాల సమూహాన్ని స్పేస్‌ఎక్స్‌ ప్రయోగిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. స్పేస్‌ఎక్స్‌ గతంలో 42,000 స్టార్‌లింక్‌ ఉపగ్రహాల కోసం అనుమతి కోరింది. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్‌లో 11,000కిపైగా ఎక్కువ ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి.

Updated Date - Nov 27 , 2026 | 04:34 AM