సౌదీ-పాక్ రక్షణ ఒప్పందం.. పేరుకేనా?
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:12 AM
ఆపరేషన్ సిందూర్ అనంతరం గతేడాది సెప్టెంబర్‌లో సౌదీ అరేబియాతో పాకిస్థాన్ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. నాటో తరహాలో రెండు....
న్యూఢిల్లీ, మార్చి 2: ఆపరేషన్ సిందూర్ అనంతరం గతేడాది సెప్టెంబర్‌లో సౌదీ అరేబియాతో పాకిస్థాన్ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. నాటో తరహాలో రెండు దేశాల్లో ఏ దేశంపై ఎలాంటి దాడి జరిగినా ఇరు దేశాలపైనా దాడి జరిగినట్టు భావించి.. మద్దతుగా యుద్ధానికి దిగాలనేది ఆ ఒప్పందం సారాంశం. కానీ ఆ ఒప్పందం కాగితాలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. కొన్నిరోజులుగా పాక్, అఫ్ఘానిస్థాన్ మధ్య పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అఫ్ఘానిస్థాన్‌పై ‘ఆపరేషన్ ఘజబ్ లిల్ హాక్’ పేరుతో పాక్ దాడులు చేపట్టింది. రాజధాని కాబుల్‌పై వైమానిక దాడులు చేసింది. అఫ్ఘాన్ ప్రతిదాడులకు దిగింది. సరిహద్దుల్లో పదుల సంఖ్యలో పాక్ సైనిక ఔట్‌పోస్టులను ధ్వంసం చేసింది. ఒక పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు ప్రకటించింది. ఇంత జరుగుతున్నా సౌదీ అరేబియా జోక్యం చేసుకోలేదు. ఎలాంటి స్పందనా వెలువరించలేదు. ఇక తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ సహా పలు ప్రాంతాలపై, చమురు రిఫైనరీపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది. కానీ పాకిస్థాన్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం గమనార్హం.