Share News

సౌదీ రిఫైనరీలపై భీకర దాడి

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:56 AM

పశ్చిమాసియాలో మళ్లీ అలజడి రేగింది. సౌదీలోని చమురు, గ్యాస్‌ రిఫైనరీలే లక్ష్యంగా ఆదివారం యెమెన్‌లోని హుతీలు భీకర డ్రోన్‌ దాడులు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్‌ శుద్ధి కేంద్రాల్లో ఒకటైన..

సౌదీ రిఫైనరీలపై భీకర దాడి

ఆరామ్‌కో బెర్రీ గ్యాస్‌ప్లాంటు, జజన్‌ రిఫైనరీల్లో మంటలు.. తామే దాడి చేసినట్లు హుతీల ప్రకటన

పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు సౌదీ వెల్లడి

దుబాయ్‌, ఆగస్టు 9: పశ్చిమాసియాలో మళ్లీ అలజడి రేగింది. సౌదీలోని చమురు, గ్యాస్‌ రిఫైనరీలే లక్ష్యంగా ఆదివారం యెమెన్‌లోని హుతీలు భీకర డ్రోన్‌ దాడులు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్‌ శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అల్‌ జుబైల్‌లోని ఆరామ్‌కో బెర్రీగ్యాస్‌ ప్లాంటులో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అలాగే యెమెన్‌ సరిహద్దులో ఎర్ర సముద్ర తీరం వెంట ఉన్న జజన్‌ ప్లాంటుపై కూడా దాడి జరగటంతో మంటల్లో చిక్కుకుంది. ఈ దాడి చేసింది తామేనని హుతీల ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ యాహ్యా సరీ ఆదివారం ప్రకటించారు. అయితే, రిఫైనరీల్లో అగ్నిప్రమాదం జరిగిందని, పరిస్థితిని అదుపులోకి తెచ్చామని సౌదీ తెలిపింది.

ఏ క్షణమైనా మళ్లీ యుద్ధం?

ఇరాన్‌తో యుద్ధం నుంచి వైదొలగాలని అమెరికా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్న వేళ.. ఇజ్రాయెల్‌ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తన మిలిటరీ సిబ్బంది సెలవులను ఇజ్రాయెల్‌ రద్దుచేసింది. ఇరాన్‌పై ఒంటరిగా దాడులు చేసేందుకే సెలవులు రద్దుచేసినట్లు భావిస్తున్నారు. ఏ క్షణమైనా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య శాశ్వత శాంతి కోసం ట్రంప్‌ ప్రతిపాదించిన 15 అంశాల గాజా శాంతిప్రణాళికను తిరస్కరిస్తున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. హమాస్‌ పూర్తిగా నిరాయుధీకరణ చెందేవరకు గాజా నుంచి తమ సైన్యం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.


మొజ్తాబా 12 సెకన్ల వీడియో విడుదల

ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా సయ్యెద్‌ మొజ్తబాకు చెందిన 12సెకన్ల నిడివితో ఉన్న వీడియోను ఇరాన్‌ మెహర్‌ న్యూస్‌ సంస్థ విడుదల చేసింది. ఆ వీడియోలో మొజ్తబా ఒక గదిలో ఉన్నవారితో ముచ్చటిస్తున్నారు. అందులో ఆయన పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. కానీ, వైమానిక దాడిలో ఆయన ముఖం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఒక కాలు కోల్పోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - Aug 10 , 2026 | 04:57 AM