Share News

ఇరాన్‌పై దాడి చేయండి!

ABN , Publish Date - Mar 23 , 2026 | 07:35 AM

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌పై దాడి చేయాలని పాకిస్థాన్‌పై సౌదీ అరేబియా ఒత్తిడి పెంచుతోంది. ఈ సందర్భంగా గతేడాది తమతో చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని గుర్తుచేస్తోంది.

ఇరాన్‌పై దాడి చేయండి!

పాక్‌పై సౌదీ ఒత్తిడి..రక్షణ ఒప్పందం తెరపైకి

న్యూఢిల్లీ, మార్చి 22: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌పై దాడి చేయాలని పాకిస్థాన్‌పై సౌదీ అరేబియా ఒత్తిడి పెంచుతోంది. ఈ సందర్భంగా గతేడాది తమతో చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని గుర్తుచేస్తోంది. సౌదీ, పాక్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఈ రెండు దేశాల్లో దేనిపై శత్రువులు దాడి చేసినా అది రెండింటిపై జరిగిన దాడిగా భావిస్తారు. అప్పుడు ఇరువురూ కలసి ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సౌదీపై ఇరాన్‌ దాడులు చేస్తోంది. అందువల్ల ఇరాన్‌పై పాక్‌ దాడికి దిగాలని సౌదీ కోరుతోంది. ఈ మేరకు సౌదీ నిపుణుల ద్వారా సందేశం పంపినట్లు తెలిసింది. ఈ రక్షణ ఒప్పందం సౌదీకి పాక్‌ అణు నిరోధక రక్షణ కల్పించడంతో పాటు అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించి ఇరాన్‌కు వ్యతిరేకంగా దాని స్థానాన్ని బలోపేతం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఒప్పందం అమలుకు పాక్‌ సిద్ధపడితే ఇరాన్‌ తూర్పు తీరం వెంబడి ఆ దేశ సైన్యం మరో యుద్ధాన్ని ప్రారంభించవచ్చు.


యుద్ధానికి పాక్‌ సిద్ధమేనా?

అయితే ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధ రంగంలోకి దిగడం పాక్‌కు అంత తేలిక కాదు. షియాల జనాభా అత్యధికంగా ఉన్న ఇరాన్‌పై దాడి చేస్తే అది దేశంలో తీవ్ర అశాంతికి దారి తీయవచ్చు. ఇరాన్‌కు మద్దతు ఇచ్చే షియాల జనాభా పాక్‌లో దాదాపు 5కోట్ల వరకూ ఉంది. యుద్ధానికి సిద్ధపడితే ఇప్పటికే దారుణంగా ఉన్న పాక్‌ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉంది. భద్రతా పరంగానూ ఆందోళనలున్నాయి. ఇరాన్‌తో 9వేల కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న పాక్‌ ఇప్పటికే అప్ఘాన్‌ మిలిటెంట్లు, బలూచ్‌ తిరుగుబాటుదారులతో ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఆ దేశం ఇప్పుడు యుద్ధంలోకి దిగడం కొత్త సవాళ్లను విసురుతుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Mar 23 , 2026 | 07:35 AM