Share News

కూలిన అమెరికన్‌ బీ52..8 మంది దుర్మరణం

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:00 AM

ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచీ బద్ధశత్రువులైన అమెరికా, రష్యాలకు చెందిన రెండు న్యూక్లియర్‌ బాంబర్‌ విమానాలు ప్రమాదవశాత్తూ ఒకే రోజు కూలిపోయాయి..

కూలిన అమెరికన్‌ బీ52..8 మంది దుర్మరణం

లాస్‌ఏంజెలెస్‌, మాస్కో, జూన్‌ 16: ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచీ బద్ధశత్రువులైన అమెరికా, రష్యాలకు చెందిన రెండు న్యూక్లియర్‌ బాంబర్‌ విమానాలు ప్రమాదవశాత్తూ ఒకే రోజు కూలిపోయాయి. అమెరికా వాయుసేన అమ్ములపొదిలో కీలకమైన, అత్యంత శక్తిమంతమైన పాతకాలం బీ52 బాంబర్‌ దక్షిణ కాలిఫోర్నియాలోని మొజావీ ఎడారిలో కూలిపోగా.. అందులో ఉన్న ఎనిమిది మందీ దుర్మరణంపాలయ్యారు. మరోవైపు, రష్యాకు చెందిన సుదూర శ్రేణి సూపర్‌సానిక్‌ స్ట్రాటజిక్‌ బాంబర్‌ టియు-22ఎం3 సైబీరియాలో నిట్టనిలువునా కూలిపోయింది (నోస్‌ డైవింగ్‌). అయితే, అందులో శిక్షణ పొందుతున్న నలుగురు సిబ్బంది సురక్షితంగా ఆ విమానం నుంచి ఎజెక్ట్‌ అయ్యి ప్రాణాలతో బయటపడ్డారు. లాస్‌ ఏంజెలెస్‌కు ఉత్తరాన 161 కిలోమీటర్ల దూరంలోని ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి.. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో రొటీన్‌ టెస్ట్‌ మిషన్‌లో భాగంగా బీ52 బాంబర్‌ టేకాఫ్‌ అయ్యిందని.. తర్వాత కొద్దిసేపటికే కూలిందని, అందులో ప్రభుత్వ కాంట్రాక్టర్లు, సైనికులు అంతా కలిపి ఎనిమిది మంది ఉన్నారని ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌కు చెందిన కర్నల్‌ జేమ్స్‌ హయెస్‌ తెలిపారు. విమానం కూలిన తీరును బట్టి వారిలో ఏ ఒక్కరూ బతికే అవకాశం లేదని ఆయన వెల్లడించారు. ఎనిమిది మంది గొప్ప అమెరికన్లను ఈ ప్రమాదంలో కోల్పోయామని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని.. దీనిపై దర్యాప్తు పూర్తి కావడానికి ఆర్నెల్లు పడుతుందని ఆయన చెప్పారు. అమెరికా న్యూక్లియర్‌ ట్రయాడ్‌లో అత్యంత కీలకమైన ‘బోయింగ్‌ బీ52’ స్ట్రాటో ఫోరె్ట్రస్‌ విమానాలు 1955లో యూఎస్‌ వాయుసేన అమ్ములపొదిలోకి చేరాయి. వియత్నాం నుంచి ఇరాన్‌ దాకా పలు దేశాలపై అమెరికా చేసిన పలు యుద్ధాల్లో కీలకపాత్ర పోషించాయి. ఇవి ఎంత పాతవైనా.. ఈ విమానాలకు ఉన్న రేంజ్‌, పేలోడ్‌ సామర్థ్యం కారణంగా అమెరికా ఇంకా వీటి టెక్నాలజీని అప్‌గ్రేడ్‌ చేసి వినియోగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బోయింగ్‌ సంస్థ నిరుడు అత్యంత అధునాతన ‘యాక్టివ్‌ ఎలకా్ట్రనిక్‌ స్కాన్డ్‌ యారే (ఏఈఎస్ఏ)’ రేడార్‌ సిస్టమ్‌ను అమర్చిన ఒక బీ52 విమానాన్ని ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌కు పంపుతున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాదంతా ఆ విమానాన్ని పరీక్షించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. అయితే, సోమవారం కూలిపోయింది అదే విమానమా లేక వేరే బీ52 బాంబరా అనేది ఇంకా తెలియరాలేదు. ఫ్లైట్‌ కంట్రోల్‌ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఏవియేషన్‌ భద్రతా నిపుణుడు జెఫ్‌ గుజెట్టి అనుమానిస్తున్నారు. ఇక, రష్యన్‌ టీయు-22ఎం3 కూలిన చోట ఎలాంటి విధ్వంసమూ జరగలేదని.. ఆ విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

Updated Date - Jun 17 , 2026 | 04:00 AM