Share News

వెంటాడి.. వేటాడి.. కూరగాయల వ్యాపారిపై రష్యా డ్రోన్‌ దాడి!

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:58 AM

వీధిలో కూరగాయలు, పండ్లు అమ్ముకునే వ్యక్తి.. వ్యాన్‌లోంచి కూరగాయల లోడ్‌ దింపుతున్నారు.. ఉన్నట్టుండి ఓ ఆత్మాహుతి డ్రోన్‌ దూసుకొచ్చింది..

వెంటాడి.. వేటాడి.. కూరగాయల వ్యాపారిపై రష్యా డ్రోన్‌ దాడి!

కీవ్‌, ఆగస్టు 5: వీధిలో కూరగాయలు, పండ్లు అమ్ముకునే వ్యక్తి.. వ్యాన్‌లోంచి కూరగాయల లోడ్‌ దింపుతున్నారు.. ఉన్నట్టుండి ఓ ఆత్మాహుతి డ్రోన్‌ దూసుకొచ్చింది.. వ్యాపారి ప్రాణభయంతో పరుగుపెట్టారు.. ఆ వ్యాన్‌ చుట్టూ తిరుగుతూ దాక్కోవడానికి ప్రయత్నించారు.. సమీపంలోనే ఉన్న తన భార్యను దూరంగా వెళ్లిపొమ్మని చెప్పారు. తనను వదిలేయాలంటూ డ్రోన్‌కు దండం పెట్టారు.. కానీ డ్రోన్‌ ఆయన ఎటు వెళితే అటు వెంటాడింది.. వేగంగా ఆయన దగ్గరికి వచ్చి పేలిపోయింది. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. సదరు వ్యాపారిని 52 ఏళ్ల యూరీగా గుర్తించారు.. ఘటనలో ఆయన ప్రాణాలతోనే బయటపడినా.. తీవ్రగాయాలయ్యాయి. ‘‘ఆ సమయంలో నా చేతిలో కేవలం కొన్ని వెల్లుల్లి గడ్డలు ఉన్నాయి. మరేమీ లేవని, వదిలేయాలని డ్రోన్‌ ఆపరేటర్‌కు కనిపించేలా చేయి ఊపాను. అయినా నాపై దాడి జరిగింది’’ అని యూరీ వాపోయారు. కాగా, రష్యా దళాలు ఫైబర్‌ ఆప్టిక్‌ ఆత్మాహుతి డ్రోన్లతో సాధారణ పౌరుల ప్రాణాలు బలిగొంటున్నాయని, ఈ ఘటనే దానికి సాక్ష్యమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.

Updated Date - Aug 06 , 2026 | 05:58 AM