Russia Warns US: టార్పిడోలతో దాడిచేసి మీ నౌకల్ని ముంచేస్తాం జాగ్రత్త!
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:20 AM
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలోని రష్యా జెండాతో వెళుతున్న వెనెజువెలా చమురు నౌక మారినెరా (పాతపేరు-బెల్లా వన్)ను అమెరికా దళాలు సీజ్ చేయడంపై రష్యా తీవ్రవ్యాఖ్యలు చేసింది.
చమురు నౌకను సీజ్ చేయడంపై అమెరికాకు రష్యా ఘాటైన హెచ్చరిక
న్యూఢిల్లీ, జనవరి 8: ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలోని రష్యా జెండాతో వెళుతున్న వెనెజువెలా చమురు నౌక మారినెరా (పాతపేరు-బెల్లా వన్)ను అమెరికా దళాలు సీజ్ చేయడంపై రష్యా తీవ్రవ్యాఖ్యలు చేసింది. అమెరికా తన చర్య ద్వారా అంతర్జాతీయ చట్టాలను, రష్యా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని కన్నెర్ర చేసింది. మున్ముం దు అమెరికా ఇలా చట్టవిరుద్ధ చర్యలకు తెగబడితే సైనిక చర్య రూపంలో ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ చట్టసభ్యుడు అలెక్సీ గురవేల్వ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తాము ఏంచేసినా చెల్లుతుంది అన్న అహంకారంతో అమెరికా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టార్పిడోలతో తాము అమెరికా నౌకలను సముద్రంలో ముంచేం దుకూ వెనుకాడం అంటూ హెచ్చరించారు. బుధవారం అమెరికా దళాలు మారినెరా నౌకతో పాటు ఏ దేశ జెండా లేకుండా వెళుతున్న మరో చమురు నౌకనూ సీజ్ చేశాయి. మారినెరా నౌకాలోని 28 మంది సిబ్బందిలో ముగ్గురు భారతీయులున్నట్లు రష్యా పేర్కొంది. మరోవైపు తన చర్యను అమెరికా సమర్థించుకుంది. అంతర్జాతీయ చట్టాలను అనుసరించే నౌకను సీజ్ చేశామని స్పష్టం చేసింది. అంక్షల చట్రంలో ఉన్న వెనెజువెలా, ఇరాన్‌కు చమురు సరఫరా చేస్తున్న నౌకల్లో మారినెరా ఒకటి అని అమెరికా పేర్కొంది. దీన్ని రష్యా ఖండించింది. చమురు రవాణా చేసే మారినెరా చట్టబద్ధంగా రిజిస్టర్ అయిందని.. రష్యా, అంతర్జాతీయ నిబంధనలను అనుసరించే ఈ నౌక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. మారినెరా సీజ్ కోసం అమెరికా దళాలకు బ్రిటన్ సహకరించడం మరింత ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ ట్రంప్‌తో మాట్లాడారు. గ్రీన్‌లాండ్‌పై బ్రిటన్ వైఖరిని ట్రంప్‌కు కెయిర్ స్టార్మర్ స్పష్టం చేసినట్లు బ్రిటన్ పీఎంవో పేర్కొంది.