ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తాం!
ABN , Publish Date - May 27 , 2026 | 04:06 AM
క్రెయిన్ రాజధాని కీవ్‌పై మరిన్ని భీకర దాడులు చేస్తామని రష్యా హెచ్చరించింది. నగరంలోని డ్రోన్ తయారీ ఫ్యాక్టరీలతోపాటు పరిపాలన కేంద్రాలు...
విదేశీయులు, దౌత్యవేత్తలు కీవ్‌ను వీడండి: రష్యా
మాస్కో, మే 26: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరిన్ని భీకర దాడులు చేస్తామని రష్యా హెచ్చరించింది. నగరంలోని డ్రోన్ తయారీ ఫ్యాక్టరీలతోపాటు పరిపాలన కేంద్రాలు, కమాండ్ పోస్టులను లక్ష్యంగా చేసుకుంటామని రష్యా విదేశాంగశాఖ తాజా ప్రకటనలో తెలిపింది. విదేశీయులు, ఇతర దేశాల దౌత్య సిబ్బంది సాధ్యమైనంత త్వరగా కీవ్‌ను వీడాలని సూచించింది. పరిపాలన, మిలిటరీ భవనాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అలాగే, రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ సోమవారం అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేసి, కీవ్‌లోని అమెరికా దౌత్యవేత్తలను వెనక్కి పిలవాలని కోరారు. శనివారం రాత్రి కీవ్‌తోపాటు ఇతర ప్రాంతాలపై రష్యా జరిపిన భీకర దాడుల్లో నలుగురు మరణించగా, సుమారు 100 మంది గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. రష్యాపై ఒత్తిడి పెంచాలని మిత్రదేశాలను కోరారు. కాగా, శుక్రవారం స్టారోబిల్స్క్ పట్టణంలోని విద్యార్థుల డార్మెటరీపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 21 మంది మరణించడంపై ప్రతిస్పందనగానే ఈ దాడులు చేస్తున్నామని రష్యా తెలిపింది. మరోవైపు, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నాలుగు రోజుల చైనా పర్యటన మంగళవారం ముగిసింది. తైవాన్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా వన్-చైనా సిద్ధాంతానికి పాకిస్థాన్ మద్దతు ప్రకటించింది. అలాగే, పాకిస్థాన్ సార్వభౌమత్వం, స్వాతంత్య్రం, ప్రాదేశిక సమగ్రతలకు చైనా మద్దతు ప్రకటించింది.