నాటోకు రష్యా అణు హెచ్చరిక
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:45 AM
బాల్టిక్ సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో నాటోకు రష్యా తీవ్ర హెచ్చరికలు చేసింది. కలినిన్‌గ్రాడ్ ప్రాంతాన్ని రష్యా నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది.
కలినిన్‌గ్రాడ్ జోలికొస్తే ప్రయోగించక తప్పదని లేఖ
ఇవి బాధ్యతారహితమైన హెచ్చరికలు: నాటో
మాస్కో, అక్టోబరు 2: బాల్టిక్ సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో నాటోకు రష్యా తీవ్ర హెచ్చరికలు చేసింది. కలినిన్‌గ్రాడ్ ప్రాంతాన్ని రష్యా నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో నాటోను అడ్డుకునేందుకు తమ సైనిక సామర్థ్యం మొత్తాన్ని వినియోగిస్తామని, అవసరమైతే అణ్వస్త్రాలను కూడా ప్రయోగిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు నాటోకు రష్యా ఓ లేఖ పంపిందని రాయిటర్స్ పేర్కొంది. పోలాండ్, లిథువేనియా మధ్య బాల్టిక్ సముద్ర ప్రాంతంలో ఉన్న కలినిన్‌గ్రాడ్.. వ్యూహాత్మకంగా రష్యాకు అత్యంత కీలకమైన భూభాగం. రష్యాకు కీలక సైనిక కేంద్రంగానూ ఉంది. అలాంటి కలినిన్‌గ్రాడ్‌లో సైనిక విన్యాసాలు చేసేందుకు నాటో దళాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా ఆరోపిస్తోంది. రష్యా ఆరోపణలను నాటో ఖండించింది. తమ సైనిక కార్యకలాపాల వల్ల రష్యా భూభాగానికి ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేందుకు మోదీ చాలా మంచి ఆలోచనలు చేస్తున్నారని ఓ సదస్సులో మాట్లాడుతూ అన్నారు. తనతో జరిగిన ప్రతీ సమావేశంలోనూ ఉక్రెయిన్ యుద్ధం అంశంపై మోదీ మాట్లాడుతుంటారని వెల్లడించారు. అలాగే, భాష, సాంస్కృతిక వైవిధ్యాల్లో భారతదేశం ఆశ్చర్యపరుస్తోందని భారత్‌పై పుతిన్ ప్రశంసలు కురిపించారు.