ఇరాన్‌కు రష్యా ‘నిఘా’ సాయం?
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:11 AM
గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై దాడికి వీలుగా ఇరాన్‌కు రష్యా నుంచి నిఘా సమాచారం అందుతోందని.. అమెరికా నిఘా సంస్థ సీఐఏ వర్గాలను ఉటంకిస్తూ...
గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై దాడికి వీలుగా ఇరాన్‌కు రష్యా నుంచి నిఘా సమాచారం అందుతోందని.. అమెరికా నిఘా సంస్థ సీఐఏ వర్గాలను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉపగ్రహ చిత్రాలు, ఇతర నిఘా సమాచారాన్ని ఇరాన్‌కు రష్యా అందజేస్తోందని సీఐఏ వర్గాలు భావిస్తున్నట్టు పేర్కొంది. నిజానికి పశ్చిమాసియా అంతటా పక్కాగా నిఘా పెట్టే టెక్నాలజీ, సామర్థ్యం ఇరాన్‌కు లేదు. దానికితోడు దాడి మొదలుపెట్టిన తొలి రెండు రోజుల్లోనే ఇరాన్ నిఘా వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలను చాలా వరకు అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. అయినా అమెరికా స్థావరాల్లోని అత్యంత కీలకమైన రాడార్లు, కమాండ్ కంట్రోల్ కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లతో కచ్చితమైన దాడి చేస్తోందని సీఐఏ వర్గాలు చెబుతున్నాయి. ఖతార్ అల్ ఉదేద్ బేస్‌లోని కీలక రాడార్‌పై, సౌదీ రియాద్‌లోని అమెరికా ఎంబసీలోని సీఐఏ కేంద్రంపై దాడులు, కువైట్‌లోని బేస్‌పై దాడి, అక్కడ ఆరుగురు అమెరికా సైనికుల మృతి వంటి అంశాలు దీనికి ఆధారమని పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్‌పై దాడి సమయంలో రష్యాకు ఇరాన్ పూర్తిగా మద్దతు ఇచ్చిందని, ముఖ్యంగా షహీద్ డ్రోన్ సాంకేతికతను అందజేసిందని గుర్తు చేస్తున్నాయి. ఆ డ్రోన్ల కారణంగానే ఉక్రెయిన్‌లో తీవ్ర నష్టం జరిగిందని స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినా.. అంతర్గతంగా నిఘా సమాచారాన్ని ఇస్తోందని అంటున్నాయి. చైనా సాయం చేస్తున్నట్టు లేదని పేర్కొంటున్నాయి.