అంతరిక్షంలోకి అణు బాంబు!
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:19 AM
అణ్వాయుధాన్ని మోసుకెళ్లే ఉపగ్రహాన్ని రష్యా ఈ ఏడాది చివర్లోనే భూ కక్ష్యలోకి పంపేందుకు సిద్ధమవుతోందన్న వార్త ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ’స్పుత్నిక్-ఎస్’ అనే ఈ..
వచ్చే నెలలో ప్రయోగానికి రష్యా సన్నాహాలు
’స్పుత్నిక్-ఎస్’ సిద్ధంగా ఉందన్న పాశ్చాత్య నిఘా వర్గాలు
బెర్లిన్, నవంబరు 24: అణ్వాయుధాన్ని మోసుకెళ్లే ఉపగ్రహాన్ని రష్యా ఈ ఏడాది చివర్లోనే భూ కక్ష్యలోకి పంపేందుకు సిద్ధమవుతోందన్న వార్త ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ’స్పుత్నిక్-ఎస్’ అనే ఈ ఉపగ్రహాన్ని డిసెంబరులోనే ప్రయోగించవచ్చని పాశ్చాత్య నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. జర్మనీ ప్రభుత్వ ప్రసార సంస్థలు డబ్ల్యూడీఆర్, ఎన్‌డీఆర్, ’సుద్దాయిష్ సైటుంగ్’ ఈ విషయం వెల్లడించాయి. జర్మనీ విదేశీ నిఘా సంస్థ బీఎన్‌డీ, జర్మనీ సైన్యం దగ్గర ఈ మేరకు సమాచారం ఉందని, దాన్ని ప్రభుత్వ పెద్దలకు వివరించాయని ఆ కథనాలు చెబుతున్నాయి. ఈ ఉపగ్రహాన్ని కొన్నేళ్ల కిందటే తయారుచేసి మాస్కో ప్రాంతంలో ఎక్కడో దాచి ఉంచారని నాటో దేశాలు పంచుకున్న నిఘా సమాచారం పేర్కొంటోంది. 60రోజుల్లోపే ప్రయోగం జరగవచ్చన్న హెచ్చరికలు నవంబరు మొదట్లోనే నాటో సభ్యదేశాలకు చేరాయి. ఈ వార్తలపై జర్మనీ ఛాన్సలర్ మెర్జ్‌ను అడిగినప్పుడు ఆయన వాటిని ధ్రువీకరించలేదు, ఖండించనూ లేదు.
మన రోజువారీ జీవితానికే ముప్పు
అంతరిక్షంలో అణు పేలుడు అంటే అది ఏదో ఒక దేశంపై వేసే బాంబు కాదు. భూమి చుట్టూ తిరిగే వేలాది ఉపగ్రహాలన్నింటికీ ముప్పు వస్తుంది. అవి ఏ దేశానివన్న తేడా ఉండదు. అలాంటి పేలుడు జరిగితే దిగువ భూ కక్ష్యలోని ఉపగ్రహాల్లో మూడో వంతు వరకూ పని చేయకుండా పోవచ్చని జర్మనీ సైన్యం అంతరిక్ష విభాగాధిపతి గత జూన్‌లోనే హెచ్చరించారు. రష్యా అణు పేలుడు పరికరాన్ని కక్ష్యలో ఉంచే సాంకేతికతపై పనిచేస్తోందన్న అనుమానాలున్నాయని ఆయన అప్పుడే చెప్పారు. కొన్ని కక్ష్యలు దశాబ్దాల పాటు ఉపగ్రహాలకు పనికిరాకుండా పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు మన జీవితమంతా ఉపగ్రహాలపైనే నడుస్తోంది. 1962లో అమెరికా పసిఫిక్ మహాసముద్రం మీద అంతరిక్షంలో ’స్టార్‌ఫిష్ ప్రైమ్’ అనే అణు పరీక్ష జరిపింది. దాని ప్రభావంతో సుమారు 1,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న హవాయి దీవుల్లో వీధి దీపాలు ఆరిపోయాయి. అప్పట్లో కక్ష్యలో ఉన్న పలు ఉపగ్రహాలు దెబ్బతిన్నాయి. ఆనాడు ఆకాశంలో ఉన్న ఉపగ్రహాలు చాలా తక్కువ. ఇప్పుడు వాటి సంఖ్య వేలల్లో ఉంది. అణ్వాయుధాలను భూ కక్ష్యలో ఉంచకూడదని 1967 నాటి అంతరిక్ష ఒప్పందం స్పష్టంగా నిషేధిస్తోంది.