Share News

రైలు మార్గం రష్యా నుంచి భారత్‌కు!

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:41 AM

అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో హోర్ముజ్‌ జలసంధి గుండా చమురు, ఇతరత్రా సరుకుల రవాణా సంక్షోభంలో పడడంతో కొత్త ప్రత్యామ్నాయాలు తెరపైకి వస్తున్నాయి.

రైలు మార్గం రష్యా నుంచి భారత్‌కు!

  • తుర్కిమెనిస్థాన్‌,ఇరాన్‌, అఫ్ఘాన్‌, పాక్‌ మీదుగా నిర్మాణం

  • బొస్ఫోరస్‌, హోర్ముజ్‌ జలసంధులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకే..

  • సరికొత్త ప్రత్యామ్నాయం.. భారీ రైల్వే కారిడార్‌ ఏర్పాటుపై రష్యా దృష్టి

  • ప్రతిపాదించిన ఆ దేశ ఉపప్రధాని ఖుస్నులిన్‌

మాస్కో, ఆగస్టు 9: అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో హోర్ముజ్‌ జలసంధి గుండా చమురు, ఇతరత్రా సరుకుల రవాణా సంక్షోభంలో పడడంతో కొత్త ప్రత్యామ్నాయాలు తెరపైకి వస్తున్నాయి. బొస్ఫోరస్‌, హోర్ముజ్‌ జలసంధుల వంటి వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా భారీ రైల్వే కారిడార్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని రష్యా పరిశీలిస్తోంది. రష్యా నుంచి భారత్‌కు నేరుగా రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసి.. తద్వారా హిందూ మహాసముద్రానికి చేరుకునే మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో రష్యా నుంచి భారత్‌ వరకూ ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశ ఉప ప్రధాని మరట్‌ ఖుస్నులిన్‌ అభిప్రాయపడ్డారు. ఇది వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉంటుందని.. ఇది సాకారమైతే రెండు దేశాల నడుమ ప్రత్యక్ష భూమార్గం ఏర్పడుతుందని రష్యా ప్రభుత్వ వార్తాసంస్థ ‘టాస్‌’కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పశ్చిమాసియాలో వ్యూహాత్మక హోర్ముజ్‌ జలసంధి, టర్కీ నియంత్రణలోని బొస్ఫోరస్‌ జలసంధి మీదుగా రవాణా ప్రమాదకరంగా మారినందున.. తుర్కిమెనిస్థాన్‌, ఇరాన్‌, అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌ గుండా రైల్వే లైన్‌, ఇతర ప్రత్యామ్నాయాలు అవసరమన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతానికి రైల్వే మార్గాన్ని నిర్మిస్తే ఆ రెండు జలసంధులపై ఆధారపడడం బాగా తగ్గుతుందని చెప్పారు. ప్రస్తుతానికి ఇదొక ప్రాథమిక ప్రతిపాదన మాత్రమేనని, దీని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు. ఈ రైలు మార్గం సాకారమైతే రష్యా-భారత్‌ మధ్య ప్రత్యక్ష భూమార్గం అవుతుందన్నారు. టర్కీలోని బొస్ఫోరస్‌ (మర్మారా సముద్రం), హోర్ముజ్‌ జలసంధి మీదుగా రవాణా ప్రమాదకరంగా మారినందున.. భారత్‌కు నేరుగా కనెక్టివిటీని అందించే ఏ ప్రత్యామ్నాయ రవాణా మార్గమైనా తమకు ఆమోదయోగ్యమేనని అన్నారు. తన ఇంధన ఎగుమతులపై అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో ఆ దేశ ఉపప్రధాని భారత్‌కు రైలు మార్గం నిర్మించాలని ప్రతిపాదించడం ప్రాధాన్యం సంతరించుకుంది.


భారత్‌కు కూడా ప్రయోజనం..

సముద్ర మార్గాలపై ఆధారపడకుండా హిందూమహాసముద్రం వైపు తన సరుకులను రవాణా చేయడానికి రష్యాకు ఇదొక ముఖ్యమైన మార్గంగా నిలుస్తుంది. అలాగే మధ్య, దక్షిణాసియాతో రష్యాకు భూమార్గ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. భారత్‌కు కూడా ఈ కారిడార్‌ ద్వారా రష్యా, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య, రవాణా సంబంధాలు మెరుగుపడతాయి. అయితే, ఈ మార్గం పలు దేశాలగుండా వెళ్లాల్సి రావడం, సదుపాయాల కల్పన వంటి సవాళ్లు ఉన్నా యి. ఈ ప్రతిపాదన ఆచరణలోకి రావడం సులువేమీ కాదనే అభిప్రాయాలున్నాయి.

Updated Date - Aug 10 , 2026 | 04:42 AM