3 రోజుల్లో 6వేల మంది ఊచకోత
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:10 AM
ఆఫ్రికా దేశం సూడాన్‌లో పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్‌ఎస్ఎఫ్) బలగాలు దారుణానికి పాల్పడ్డాయి. గతేడాది అక్టోబరు చివర్లో డార్ఫర్ ప్రాంతంలో ఈ బృందాలు జరిపిన క్రూరమైన హింసాకాండలో...
సూడాన్‌లో ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాల మారణహోమం!
ఐక్యరాజ్యసమితి నివేదికతో వెలుగులోకి
కైరో, ఫిబ్రవరి 15: ఆఫ్రికా దేశం సూడాన్‌లో పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్‌ఎస్ఎఫ్) బలగాలు దారుణానికి పాల్పడ్డాయి. గతేడాది అక్టోబరు చివర్లో డార్ఫర్ ప్రాంతంలో ఈ బృందాలు జరిపిన క్రూరమైన హింసాకాండలో మూడు రోజుల్లోనే 6వేల మందికి పైగా మరణించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. సూడాన్ పశ్చిమ ప్రాంతంలోని ఎల్-ఫాషర్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంలో భాగంగా ఆర్‌ఎ్‌సఎఫ్ తీవ్రమైన యుద్ధ నేరాలకు పాల్పడిందని తెలిపింది. ఆర్‌ఎ్‌సఎఫ్, దాని అనుబంధ అరబ్ మిలిటెంట్లు 18 నెలల ముట్టడి అనంతరం గత అక్టోబరు 26న డార్ఫర్‌లో సూడన్ సైన్యానికి మిగిలిన ఏకైక బలమైన కోట ఎల్-ఫాషర్‌ను ఆక్రమించాయి. ఈ క్రమంలో ఎల్-ఫాషర్‌తో పాటు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. అక్టోబరు 25, 27వ తేదీల మధ్య ఈ నగరంలో ఉంటున్న దాదాపు 4,400 మందిని హతమార్చగా, పారిపోవడానికి ప్రయత్నించిన మరో 1,600 మందిని బలగాలు ఊచకోత కోశాయి. ఇందులో సామూహిక హత్యలు, మరణశిక్షలు, లైంగిక హింస, అపహరణలు, నిర్బంధాలు తదితర దారుణాలకు పాల్పడినట్లు 29 పేజీల నివేదిక పేర్కొంది. వీటిలో చాలావరకూ దాడులు జాతి ఆధారంగానే జరిగాయని తెలిపింది. ఎల్-ఫాషర్‌లో సుమారు వారం రోజుల పాటు జరిగిన మారణకాండలో మృతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగానే ఉండొచ్చని నివేదిక పేర్కొంది. అయితే ఈ నివేదికపై ఆర్‌ఎ్‌సఎఫ్ వర్గాలు స్పందించలేదు.