రోబోలకు తిక్క రేగితే..!!
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:30 AM
మనుషుల రోజువారీ జీవితంలో హ్యుమనాయిడ్ రోబోల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. వంట పని, ఇంటి పని ు మొదలుకొని విద్య, వైద్య రంగాల్లో ...
ప్లేట్లు పగలుకొట్టి డ్యాన్స్ చేసిన రోబో
వృద్ధురాలిని భయపెట్టి అరెస్టయిన మరో రోబో
మనుషుల రోజువారీ జీవితంలో హ్యుమనాయిడ్ రోబోల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. వంట పని, ఇంటి పని ు మొదలుకొని విద్య, వైద్య రంగాల్లో అనేక రకాల పనుల్లో రోబోలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మనుషులకు కష్టమైన పనులను ఎంతో సులువుగా చేసి పెడుతున్నాయి. ఇదంతా ఓ కోణమైతే.. రోజువారీ పనుల్లో మనం భాగం చేసుకున్న రోబోల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే పరిస్థితేంటి ? పని ఒత్తిడి లేదా మరేదైనా సమస్య వల్ల మనుషులు సహనం కోల్పోయు కొన్ని సందర్భాల్లో ఎంత తిక్కగా ప్రవర్తిస్తారో.. రోబోలు కూడా అంతే.. సాంకెతిక సమస్యను సరిచేసే లోపు రోబోలు ఎంత తిక్కగా ప్రవర్తిస్తాయో.. ఎంత గందరగోళాన్ని సృష్టిస్తాయో వివరించే కొన్ని ఘటనలివి.
ప్లేట్లు పగలుకొట్టేసింది
క్యాలిఫోర్నియాలోని శాన్‌జోస్ ప్రాంతంలోని ఓ హాట్‌పాట్ రెస్టారెంట్ తన వినియోగదారులకు ఆహారంతోపాటు వినోదాన్ని అందించేందుకు ఓ డ్యాన్సింగ్ రోబోను వినియోగిస్తుంది. రెస్టారెంట్‌కు వచ్చిన వారి కోసం డ్యాన్స్ చేయడం ఆ రోబో పని. అయితే, ఏమైందో ఏమో కానీ ఆ రోబోలో ఏదో సాంకేతిక సమస్య తలెత్తింది. అంతే. పిచ్చిపట్టినట్టు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో రెస్టారెంట్‌లోని ఓ టేబుల్‌పై ఉంచిన ప్లేట్లు, స్పూన్లు ఇతర వస్తువులను విసిరికొట్టింది. గమనించిన రెస్టారెంట్ సిబ్బంది ఆ రోబోను నియంత్రించేందుకు నానాఫీట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
వృద్ధురాలిని భయపెట్టిన రోబో అరెస్టు
చైనాలోని మకావ్‌లో ఓ 70 ఏళ్ల వృద్ధురాలిని నడిరోడ్డుపై భయపెట్టిన హ్యుమనాయిడ్ రోబోను పోలీసులు అరెస్టు చేశారు. గత గురువారం సాయంత్రం ఓ వృద్ధురాలు రోడ్డు మీదు వెళుతూ ఫోన్ మాట్లాడుతుండగా.. ఓ హ్యుమనాయిడ్ రోబో వచ్చి ఆమె వెనుక ఆగింది. రోబోను గమనించిన ఆ మహిళ హడలిపోయింది. ఏం చేద్దాం అనుకుంటున్నావ్, నా వెంట ఎందుకు పడుతున్నావ్ ? అంటూ కేకలు వేసింది. ఏం చేసినా ఆ రోబో అక్కడి నుంచి కదలకపోవడంతో.. విషయం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులు రోబోను అరెస్టు చేసి తీసుకెళ్లారు. యూనీట్రీ జీ1 మోడల్ ఆ రోబో ఓ విద్యా సంస్థకు చెందినదిగా గుర్తించిన పోలీసులు.. వారిని హెచ్చరించి రోబోను ఇచ్చేశారు.